పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇంకా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన, అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోందన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం ఉందన్న రేవంత్‌రెడ్డి, అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పకుండా గుర్తించి గౌరవిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నామన్న ఆయన, కాంగ్రెస్ నేతలకు ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పదవులు లాంటివి ఉన్నాయన్నారు.
ఐఏఎస్‌ల నుంచి ఎమ్మార్వో వరకు కొందరు అధికారులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనేక హోదాల్లో రిటైరైన వారిని అధికార పార్టీ కోసం, ప్రస్తుతం పనిచేసే అధికారులు మోహరించారని అన్నారు. బీఆర్ఎస్ కు అనుకూల అధికారుల వివరాల సేకరణకు కమిటీని నియమిస్తున్నామన్న ఆయన, కాంగ్రెస్‌పై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పింఛన్లు తప్ప కోడ్ అమల్లోకి వచ్చాక ఓటర్లకు నిధులు విడుదల చేయకూడదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కొందరు ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నార రేవంత్ మండిపడ్డారు.
వామపక్షాలకు ఓటు బ్యాంక్వామపక్ష పార్టీలతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సీపీఐ, సీపీఎం పార్టీల అగ్రనేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఇప్పటికే సమావేశం అయ్యారు. కమ్యూనిస్టులతో కలిసి వెళ్తే వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టవచ్చని, వామపక్ష పార్టీలకు గెలిచే సత్తా లేకున్నా ఓడించే సత్తా మాత్రం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు హై కమాండ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పాజిటివ్ గా, అటు బీఆర్ఎస్ కు నెగిటివ్ గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్పొత్తు విషయం తేల్చకుండానే 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించడంపై కమ్యూనిస్టులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మునుగోడులో తమను వాడుకుని గట్టెక్కిన అధికార పార్టీపై రివెంజ్ తీర్చుకోవాలని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖంగా ఉంది. బీఆర్ఎస్ హ్యాండిచ్చిన తర్వాత ఎన్నికలు, పొత్తులపైనే సీపీఎం ఫోకస్ పెట్టింది. ముందుగా సీట్లు సంగతి తేలితేనే పొత్తు ఉంటుందని కాంగ్రెస్ నేతలుకు కామ్రేడ్లు చెబుతున్నట్లు సమాచారం. పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ సీట్లను వామపక్షాలు కాంగ్రెస్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు పార్టీల సహకారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నదే కాంగ్రెస్ ప్లాన్. మరోవైపు కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏమీ లేదు. కానీ.. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వామపక్షాలు బీఆర్ఎస్ తో కలిసి పని చేశాయి. అప్పుడే తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నాయి. సీపీఎం నేతలు తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. పీఐకి రెండు, సీపీఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని తెలుస్తోంది.