సినీ పరిశ్రమలో కాస్త సెటిల్ అయిన తర్వాత చాలామంది నటీనటులు రాజకీయాల వైపు ఆసక్తి చూపించడం మొగ్గుచూపడం కామనే. పైగా నటీనటులు రాజకీయాలపై సినిమాలను తెరకెక్కిస్తే చాలు.. వారికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందని, వారు త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని రూమర్స్ మొదలయిపోతాయి. తాజాగా అనసూయకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. అనసూయ కీలక పాత్ర చేసిన ‘రజాకర్’ చిత్రం పూర్తిగా పొలిటికల్ జోనర్ సినిమాలాగా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ నుండి ‘భారతీ భారతీ ఉయ్యాలో’ పాట లాంచ్ కోసం మూవీ టీమ్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్‌లో అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురయ్యింది.


‘రజాకర్’లో అనసూయ పాట..


అనసూయ.. నటిగా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా.. తన కెరీర్‌కు బ్రేక్ వచ్చింది మాత్రం తను యాంకర్‌గా మారిన తర్వాతే. దీంతో అనసూయ పూర్తిగా యాంకర్‌ అనసూయగా మారిపోయింది. అంతే కాకుండా ఆ యాంకరింగే తనకు సినిమాల్లో నటిగా అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన అనసూయ.. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. అలా తను కీలక పాత్రలో నటిస్తున్న తరువాతి చిత్రం ‘రజాకర్’. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్.. ఎన్నో రాజకీయ దుమారాలను రేకెత్తించింది. స్వాతంత్ర్యం సమయంలో హైదరాబాద్‌ను పూర్తిగా ఇస్లామిక్ రాజ్యం చేద్దామనుకున్న ముస్లింల కథ ఇది. ఆ సమయంలో హిందువులతో పాటు ఇతర మతాలు ఎలా ఇబ్బందులు పడ్డాయని ఈ చిత్రంలో చూపించనున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ‘రజాకర్’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుండి ‘భారతీ భారతీ ఉయ్యాలో’ పాట లాంచ్ జరిగింది. ఈ లాంచ్‌లో అనసూయ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.


బీజేపీ నాయకుడి నిర్మాణంలో చిత్రం..


‘రజాకర్’ చిత్రం ఒకప్పటి రాజకీయాలపై తెరకెక్కడం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాను బీజేపీ నాయకుడు గూడూన్ నారాయణ్ రెడ్డి నిర్మించడం మరొక ఎత్తు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఈ సినిమా ఉంటుందనే ఉద్దేశ్యంతో నారాయణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ‘రజాకర్’ నుండి విడుదలయిన ‘భారతీ భారతీ ఉయ్యాలో’ పాట బతుకమ్మ పండగ నేపథ్యంలో ఉంది కాబట్టి ప్రెస్ మీట్‌లో ఆ పండగకు సంబంధించిన ప్రశ్నలతో పాటు తన రాజకీయ ఎంట్రీపై కూడా అనసూయకు ప్రశ్న ఎదురయ్యింది. పెళ్లికి ముందు చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అన్నీ ఆడేదాన్నని, పెళ్లి అయిన తర్వాత తన భర్త సాంప్రదాయాలు వేరు కాబట్టి అవన్నీ మానేయాల్సి వచ్చిందని బయటపెట్టింది అనసూయ.


బీజేపీలోకి ఆహ్వానిస్తే..


‘రజాకర్’ చిత్రం అప్పటి రజాకర్లపై ఆధారపడి తెరకెక్కింది కాబట్టి.. ఒకప్పుడు వారు మహిళలను నగ్నంగా నిలబెట్టి బతుకమ్మ ఆడిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయా అని అనసూయను ప్రశ్నించారు. అయితే అలాంటివి తెలుసుకోవాంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అని సస్పెన్స్‌లో పెట్టింది అనసూయ. సినిమా కథ విన్న తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనిపించలేదా మీకు అని ప్రశ్నించగా.. ‘‘లేదు. బయట ఉండి కూడా చాలా ఉద్దరించవచ్చు. నేను ఏ ఇంటికి, ఏ రాజకీయానికి చెందినదాన్ని కాదు అని నమ్ముతాను. రాజకీయాల్లోకి రాకపోయినా.. నేను చేయాల్సిన నీటిబొట్టు చేస్తూ వస్తున్నాను. అది చాలామందికి తెలుసు. రాజకీయాల్లో ఉన్నవారు కూడా మనల్ని చూసుకుందామని వచ్చిన మనుషులే. అందుకే వారి పని వాళ్లని చేయనిద్దాం. నా వంతు నేను చేస్తాను.’’ అంటూ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ. ఒకవేళ నిర్మాత నారాయణ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా అని అడగగా.. ‘‘నేను అలా అనుకోను. అసలు ఈ టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. రాజకీయం అనేది నా వల్ల కాదు’’ అంటూ రాజకీయాల్లో ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది.


Also Read: అప్పుడు చిరంజీవి మేనకోడలిగా - ఇప్పుడు సాంప్రదాయ నృత్య కళాకారిణిగా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial