ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. 'బబుల్ గమ్'(Bubble Gum) అనే న్యూ ఏజ్ లవ్ స్టోరీ ద్వారా రోషన్ కనకాల హీరోగా లాంచ్ అవుతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎస్. ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా.. మంగళవారం ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాదులో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ లాంచ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరై తన చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ కు రోషన్ కనకాల తల్లి సుమా యాంకరింగ్ చేయడం విశేషం. అయితే ఈ ఈవెంట్లో రోషన్ తండ్రి రాజీవ్ కనకాల సైతం పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. "నా కొడుకు సినిమా టీజర్‌ను లాంచ్ చేయడానికి వచ్చిన హీరో నానికి కృతజ్ఞతలు. మా అబ్బాయిని, ఈ టీజర్ ను ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఇప్పటివరకు రాజీవ్ కనకాల అని పిలువగానే కనకాల వినబడింది కదా అని వేదిక మీదికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడిని. ఇప్పుడు రోషన్ కనకాల అని పిలువగానే నన్నే పిలుస్తున్నారేమో అని లేచాను. కానీ ఆ తర్వాత నన్ను కాదులే అని అలా కూర్చుండిపోయా. రోషన్ కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశావు. టీజర్ లో చూసి నువ్వు ఇంకా బాగా చేసి ఉంటావని అనుకుంటున్నాను. టీజర్ లో లాస్ట్ షాట్ చూసి.." అని చిన్న చిరునవ్వు చిందిస్తూ రాజీవ్ కనకాల అలా ఉండిపోయారు.


వెంటనే ఈవెంట్ లో ఉన్న వాళ్లంతా అరవడం మొదలుపెట్టారు. దాంతో రాజీవ్ దగ్గరికి వచ్చిన సుమ.. "కొన్ని మనం మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా పద" అంటూ పక్కకు లాక్కెళ్లారు. మళ్లీ అందరూ అరిచారు. "సరే అలాగే జనరల్ గా వాళ్లకు అనిపించింది నేను చెప్పాను. అవునా? కాదా" అని రాజీవ్ కనకాల అనగానే మళ్లీ అందరూ అరిచారు. వెంటనే సుమ మాట్లాడుతూ.."చూడు నేను మనసు గట్టిగా చేసుకుని ఉండట్లేదా? నేను ఇందాకే చూశాను. పద వెళ్దాం" అని రాజీవ్ చేయి పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. "ఇంకా మనం ఏమేమి చూడడానికి మిగులిందో. ఇది టీజర్ మాత్రమే" అని చివర్లో సుమ నవ్వుతూ అన్నారు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక 'బబుల్ గమ్' సినిమా విషయానికొస్తే.. 'క్షణం', 'కృష్ణ అండ్ హిస్ లీలా' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీజ్ మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్ కనకాల సరసన మానస చౌదరి కథానాయికగా నటిస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతూ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, నిషేద్ యూసఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ టీజర్ ద్వారా వెల్లడించారు.


Also Read : మైత్రికి 'సలార్' నైజాం - ఇది ఏషియన్ సునీల్, 'దిల్' రాజుకు గట్టి పోటీయే!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial