Telangana Investments : తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకువచ్చింది. ఈ మేరకు కంపెనీ ఎండీ పంకజ్ పట్వారీ , సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కేటీఆర్‌కు వివరించారు. సంస్థ పెట్టుండిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఫార్మా, లైఫ్ సైఫ్‌సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ వృద్ధికి సంకేమని చెప్పారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ సమీపంలోని సీతారామపురం, చందన్‌వెల్లి పారిశ్రామికవాడల్లో గురువారం రూ.1,400 కోట్లతో నిర్మించనున్న కైటెక్స్, రూ.350 కోట్లతో స్థాపించనున్న సింటెక్స్ సంస్థల తయారీ యూనిట్లకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వెల్‌స్పన్ గ్రూప్ తన మూడో యూనిట్ సింటెక్స్ పైపులు, ట్యాంకుల పరిశ్రమను వచ్చే 9 నెలల్లో పూర్తిచేసి వెయ్యి మందికి ఉపాధి కల్పించనుంది. గిన్నిస్‌బుక్ రికార్డు లక్ష్యంగా మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కైటెక్స్.. అసెంబ్లింగ్ గార్మెంట్స్, అపెరల్స్ యూనిట్‌ను సీతారాంపురం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేస్తోంది. 2024 నాటికి ఈ కేంద్రం అందుబాటులోకి వస్తుంది. ప్రతిరోజూ 7 లక్షల దుస్తులను ఉత్పత్తి చేయనుంది. ఈ సంస్థ ద్వారా 18 వేల మందికి ఉపాధి లభించనుంది.
వెల్‌స్పన్ గ్రూప్ అయిదేళ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో చందన్‌వెల్లిలో లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్న సంస్థల్లో 26 శాతం సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.