Telangana IT Minister KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతులకు పెట్టబుడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని వివరించారు. అలాగే భారత దేశంలో గత 75 ఏళ్లలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని పనిని కేవలం ఐదారేళ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందని వెల్లడించారు. కేవలం వరి మాతమ్రే కాకుండా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ప్రీయునిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. 






ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమంటే కొర్రీలు పెడుతుందని విమర్శించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. వేల టన్నుల నూనెను దేశంలోకి దిగుమతి చేసుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పారు. 20 లక్షల ఎకరాలకు అయిల్ పామ్ సాగు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. తద్వారా రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా నూనెలను ఎగుమతి చేయనున్నామని తెలిపారు.


ఆయిల్ పామ్ సాగుకు పెద్ద ఎత్తున సబ్సిడీ అందిస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా నెలకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున ఆదాయం సమకూరుతుందని చెప్పుకొచ్చారు. ఆధునియ వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో పంటల సాగులో మెళుకువలు తెలుసుకోవాలని సూచించారు. ఊరూరికి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. 






ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ భూమి పూజ అనంతరం.. జిల్లాలోని రాజపేట గ్రామంలో నిర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలు ప్రారంభించారు. ఆ తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఎల్లూర్ రిజర్వాయర్ నుండి వనపర్తి జిల్లాలోని వనపర్తి, బాలకిష్టాపూర్ లకు త్రాగునీరు అందించేందుకు బుగ్గపల్లి తండా వద్ద 75 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించిన నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. దాని తర్వాత భూసార పరీక్షల మొదలుకొని పండిన పంటల కొనుగోలు వరకు అన్ని వ్యవసాయ ప్రక్రియ దశల్లో తెలంగాణ ప్రభుత్వం రైతుల వెన్నంటి నిలుస్తుందన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మహాత్మా జ్యోతిబాపూలే మహిళా వ్యవసాయ కళాశాల భవనానికి కూడా మంత్రులు ఇద్దరూ శంకుస్థాపన చేశారు.