Swine Flu in Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. గత కొంత కాలంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు తెలిపారు. స్వైన్ ఫ్లూ సోకడంతో ఆ మహిళను రిమ్స్ ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమలు పెరిగిపోయాయి. జలబు, జ్వరాలు తీవ్ర రూపం దాల్చి ప్రజలను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.  జిల్లాలో చాలా మంది ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. చాలా మంది వైరల్ ఫీవర్స్ అనుకుంటూ ఇంట్లోనే ఉండగా.. జ్వరం ఎక్కువైన వాళ్లు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.


జ్వరపీడితుల కోసం 516 మెడికల్ క్యాంపులు..!


జిల్లా వైద్యాధికారులు కూడా ఇవి వైరల్ ఫీవర్స్ అని చెబుతున్నారు. కానీ లక్షణాలు మాత్రం మలేరియా, డెంగీ, టైఫాయిడ్లను పోలి ఉంటున్నాయి. ముఖ్యంగా కుభీర్‌, తానూర్‌, లోకేశ్వరం, మామడ, సారంగాపూర్‌, లక్ష్మణచాంద తదితర మండలాల్లో అయితే జ్వర పీడితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విషయం గుర్తించిన అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 516 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల ద్వారా ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లో 2441 మందికి వైరల్ ఫీవర్ సోకినట్లు గుర్తించారు. అలాగే 813 మంది డయేరియాతో అస్వస్థతకు గురైనట్లు పేర్కొంటున్నారు. 


నిలిచి ఉన్న నీటిలో ఈగలు, దోమలు ముసిరి...


అంతే కాకుండా ఇటీవల కురిసిన బారీ వర్షాలు, వరదల కారణంగా పాడైన పరిసరాలను శుభ్రం చేస్కోవాలని అధికారులు చెబుతున్నారు. వాటి వల్లే వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయని వివరిస్తున్నారు. వాతావరణంలో వేడి తీవ్రత తగ్గకపోవడం అలాగే వర్షాల కారణంగా నీరు నిలిచి ఉంటున్నందున వాటిల్లో ఈగలు, దోమలు ముసురుతున్నాయని చెప్పారు. ముందుగా జలుబు మొదలై ఆ తర్వాత దగ్గు, జ్వరం తీవ్రం అవుతున్నాయని పేర్కొన్నారు. అవే టైఫాయిడ్, డెంగీ, మలేరియా, డయేరియాలా మారి ప్రజలను సతమతం చేస్తోందని వివరించారు. 


ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు..!


వీరంతా ఆస్పత్రుల చుట్టూ తిరగడంతో చాలా ఆసుపత్రుల్లో బెడ్ లు కూడా దొరకడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటి ముందు రోగులు క్యూ కడుతున్నారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీలతో పాటు పట్టణంలోని ప్రదాన ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో నిండిపోయాయి. ఓపీ కోసం వచ్చే వాళ్లు కూడా గంటలు గంటలు వాటి ముందే క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా జ్వరం తగ్గకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. వైరల్ ఫీవర్స్ తో వచ్చే వారి సంఖ్య కేవలం ఆదిలాబాద్ లోనే కాదు భైంసా, ఖానాపూర్ లో ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు కిలకిటలాడుతున్నాయి.