Road Accident : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందారు. తాంసి మండలంలోని హస్నాపూర్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి గాయపడిన వారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడగా.. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్ - ఆంద్ బోరి నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బైక్ ను తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇచ్చోడ మండలం కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన మనీషా(15), సంస్కార్ (11), వీరి తండ్రి మారుతి (40) మృతి చెందారు. తల్లి వందనకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. దీంతో అశోక్ నగర్ లో విషాదం అలుముకుంది. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు.
లారీ ఢీకొని సీనియర్ అడ్వకేట్ మృతి
సిద్ధిపేటలో ముంద్రాయికి చెందిన సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్ పై ఆయనను రంగధాంపల్లి అమరవీర స్థూపం వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన దశమంతరెడ్డి సంఘటన స్థలంలోని ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకు తరలించారు. విషయం తెలిసిన న్యాయవాదులు సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నారాయణ పేటలో విషాదం
తెలంగాణ నారాయణపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. క్రిష్ణా మండలం చేగుంట గ్రామ శివారులో రైలు క్రింద పడి సూసైడ్ చేసుకున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి,పార్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కూలి పనుల కోసం కుటుంబసభ్యులతో కలిసి కొన్ని రోజుల క్రితం చేగుంట గ్రామానికి వచ్చారు. చేగుంట మాజీ ఎంపీటీసీ లింగప్ప పొలంలో 35 మంది కూలీలతో కలిసి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. పత్తి తీసేందుకు కూలికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు మునికుమార్ కు, మృతురాలు అనితకు బాబాయి వరస అవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతులు ఇద్దరూ ఇవాళ తెల్లవారుజామున చేగుంట గ్రామ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.