Telugu News: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల, తలమడుగు, తాంసి, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు అటవీ ప్రాంతాల్లో అటూ కవ్వాల్ అభయారణ్యం అటవీ ప్రాంతాల్లో బోడ కాకర కాయలు ఎక్కువగా దొరుకుతాయి. కేవలం అటవీ ప్రాంతంలోనే కాదు దట్టమైన పొదల్లో, చెట్లకు అల్లుకొని ఉన్న తీగల్లో ఈ బోడ కాకరకాయ పెరుగుతుంది. జూలై నుండి ఆగస్టు నెల వరకు మాత్రమే ఇవి కాస్తాయి. బోడ కాకర కాయలు సహజంగా లభిస్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో బోడ కాకరలు ఎక్కువగా దొరుకుతున్నాయి.
ఔషధ గుణాలు
గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు అడవుల్లో సేకరించి, స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు. పావు కిలో 40 రూపాయల నుంచి నుంచి 50 రూపాయల వరకు ధర పలుకుతోంది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిలో 200 రూపాయలు పలుకుతోంది. నేరడిగొండ, నిర్మల్, మంచిర్యాలలో ధర 400 కిలో పలుకుతోంది. వర్షాకాలం సీజన్ లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు మార్కెట్లో ప్రస్తుతం కొండెక్కాయి. వానాకాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్లు చెబుతుంటారు. చాలామంది శ్రావణమాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ఇంటికి ఏ చుట్టం వచ్చినా.. ఈ బోడ కాకరకాయతో వంటలు చేసి పెడతారు. అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు.
చాలా పోషకాలు
ఇంతకీ ఈ బోడ కాకర గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనిని అడవి కాకర.. లేదా ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ కూరగాయలో ఎన్నో పోషకాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సీజనల్ గా దొరికే కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి. కేవలం ఆషాడం, శ్రావణ మాసాల్లోనే దొరికే వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను బలపరుస్తుంది. బోడకాకరను పోషకాల గని అనొచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో ఉంటాయి.
శరీరం ఫిట్ గా ఉండటానికి కావాల్సినవి అన్నీ ఈ కూరగాయలో ఉన్నాయి. బోడ కాకర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. బోడ కాకర కాయలు తింటే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బోడ కాకర కాయలు తినడం వల్ల ఇది రక్తంలోని చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మంచిదని చెప్తున్నారు. ఫైటో న్యూట్రిషన్ కలిగిన బోడ కాకరకాయ శరీరంనుండి నీరసాన్ని తగ్గిస్తుంది.
ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. బోడ కాకర కాయలలో ఫైబర్ ఉంటుంది. ఇది అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. బోడ కాకర కాయలు యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. అంతేకాదు బోడ కాకరకాయలను గర్భిణీ స్త్రీలు కూడా కూర చేసుకొని తినడం వల్ల గర్భస్థ శిశువు కూడా బాగా ఎదుగుతుందని చెబుతారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న బోడ కాకరకాయను ఈ సీజన్లో తినడం అసలు మర్చిపోవద్దు. చికెన్, మటన్ కంటే ఇది గొప్ప పోషకాలతో ఉన్న కూరగాయ కాబట్టి ఈ సిజన్ తప్పా మళ్ళీ దొరకవు.