Wayanad Landslides LIVE updates: కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం, బురద కొట్టుకురావడంతో 84 మందికిపైగా జల సమాధి అయ్యారు. ఇప్పటి వరకూ వెలికి తీసిన మృతదేహాల సంఖ్య 84. ఇంకా వందల మంది వరదల్లో గల్లంతయ్యారు. ఈ జల ప్రళయం కేరళను అల్లకల్లోలం చేసింది. అర్థరాత్రి సమయంలో వయనాడ్ జిల్లాలో ఊళ్లకు ఊళ్లు కొండచరియలు, బురద, వరద నీటిలో చిక్కుకుపోయాయి. యనాడ్లోని ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి.
నామరూపాల్లేని నాలుగు గ్రామాలు
ముండక్కై అనే గ్రామం గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. అ గ్రామంలో ఇళ్లు కూలిపోయాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కొండ చరియలు సృష్టించిన భయానక పరిస్థితులే కనకిపిస్తున్నాయి. అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా, 2 నుంచి 4 గంటల మధ్యలో వయనాడ్ జిల్లాపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. వర్షం పడుతూనే ఉండటంతో సహాయక బృందాలకు ఇబ్బందిగా మారింది. 200 మంది సైనికులు సహాయక చర్యల్లో భాగమయ్యారు. ఈ ఘటనపై కేంద్రం కూడా వెంటనే స్పందించింది.
భారీ వర్షాలతో సహా చర్యలకు అంతరాయం
అయితే వయనాడ్‌లో భారీ వర్షాలు ఆగకపోవడంతో ఇప్పికీ సహాయ చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారు. కేరళలోని 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్ జిల్లాలో వరదలకు బలైపోయిన బాధితులకు సంతాప సూచికగా రెండు రోజులను కేరళ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. కేరళకు వెళ్లే పలు రైళ్లు వరదల కారణంగా తాత్కాలికంగా రద్దు చేశారు. 17 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
పార్లమెంట్‌లో ప్రస్తావన
ఈ ఘటనపై పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు విషాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు. రక్షణ మంత్రితో, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని రాహుల్ గాంధీ తెలిపారు. . రెస్క్యూ, వైద్య సంరక్షణ కోసం సాధ్యమైన అన్నివిధాలుగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. మృతుల బంధువులకు తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలి. వీలైతే పరిహార మొత్తాన్ని పెంచొచ్చు. ముఖ్యమైన రవాణా కమ్యూనికేషన్ లైన్లను పునరుద్ధరించాలని కోరారు.