New Telangana Electricity Commission  Chairman Justice Madan B Lokur :  తెలంగాణలో గత ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు కొత్త చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉమ్మడి ఏపీకి కూడా  చీఫ్ జస్టిస్‌గా పని చేసిన మదన్ బి లోకూర్ నేతృత్వం వహించనున్నారు. మొదట ఈ కమిషన్‌కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వం వహించారు. అయితే ఆయనపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్  దాఖలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారని.. ముందుగానే తన అభిప్రాయం చెప్పారని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు..  జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించాలని ఆదేశించింది. కఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించాలని నిర్ణయించింది. 


 సుదీర్ఘమైన ట్రాక్ రికార్డు ఉన్న న్యాయకోవిదుడు మదన్ బి లోకూర్                     


జస్టిస్ మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్‌ 31న జన్మించిన లోకూర్,  1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిధులు నిర్వర్తించారు.   2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లోకూర్‌  నియమితులయ్యారు.  భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్‌ లోకూర్‌ ఒకరు.


విద్యుత్ అవకతవకలపై విచారణ చేయించాలని రేవంత్ సర్కార్ రాగానే నిర్ణయం                           


బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విచారణ నిర్వహించాలని నిర్ణయించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్  విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ  కేసీఆర్   తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కమిషన్ చైర్మన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముందే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని కోర్టుదృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణ కమిషన్ ను మార్చాలని ఆదేశించింది. 


మళ్లీ మొదటి నుంచి  జస్టిస్ లోకూర్ విచారణ జరిపే అవకాశం                                


మదన్ బి లోకూర్ మళ్లీ మొదటి నుంచి విచారణ జరిపే అవకాశం ఉంది. ఏ ఏ అంశాలపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరుపుతారో అదే అంశాలపై..  నదన్ బి లోకూర్ విచారణ కొనసాగించనున్నారు.