Bandi Sanjay Comments KTR: కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే... హరీష్ రావు పని ఔట్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు వ్యవసాయంపైనే ఫోకస్ పెట్టానని, ఇకపై ఉద్యోగాల సంగతి చూస్తానని, తెలంగాణలో ఇకపై ఇల్లులేని వారే ఉండబోరని కేసీఆర్ చెప్పడంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లు భూములమ్మి, ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడంపైనే ఫోకస్ చేసిన కేసీఆర్.. ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తాడట. ఉద్యోగులు ఇకపై పనికూడా చేయరు. ఇల్లు లేని వాళ్లే ఉండరంటే.. పేదలందరినీ తెలంగాణ నుంచి పాకిస్తాన్ కు తరిమేస్తాడమో?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు.
‘‘ఆదిలాబాద్ జిల్లా డెవలప్ అవ్వడానికి పెద్ద ఎత్తున నిధులిచ్చింది నరేంద్రమోదీ ప్రభుత్వమే. పటాన్ చెరువు నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 317 కి.మీల ఈ రైలు మార్గానికి దాదాపు రూ.5,706 కోట్లు కేటాయించింది. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో పిట్‌లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం 18 కోట్లు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి తెలంగాణలోని భోరాజ్ వరకు విస్తరించి ఉన్న 2-లేన్ జాతీయ రహదారి 353B ను 4-లేన్ల రహదారిగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం 350 కోట్లను కేటాయించింది. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 39 కోట్లు మంజూరు చేసింది.
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు కేటాయించింది. అమృత్ పథకం కింద ఆదిలాబాద్ సుందరీకరణకు 6. 42.5 కోట్లు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండ సాంగ్వి గ్రామం మరియు జైనథ్ మండలం నేరాల గ్రామం మధ్య రోడ్డు వేయడానికి కేంద్ర ప్రభుత్వం 40.24 కోట్లు మంజూరు చేసింది. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం ఎంపిక చేయబడింది. దీని కింద రైల్వే స్టేషన్‌లకు తాగునీరు, మరుగుదొడ్లు, మోడల్ మాల్స్ కాంప్లెక్స్, ప్లాట్‌ఫారమ్, ఆధునిక టికెట్ కౌంటర్లు, ఎస్కలేటర్‌లను ఒక్కొక్కటి రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్లతో అందజేయనున్నారు.
కేంద్రం పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాకు నిధులిస్తుంటే... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వాటిని దారి మళ్లిస్తోంది. ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన చనాక కొరాట ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాత్నాల ప్రాజెక్ట్‌పై చెక్ డ్యామ్‌లను నిర్మించడంలో కూడా విఫలమైంది. పద్మశాలి కమ్యూనిటీకి మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న హామీ ఇచ్చారు, కానీ ఆయన అమలు చేయలేకపోయారు.
ఈ నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ప్రధాన సమస్యగా మారింది. వివిధ వర్గాలకు చెందిన పలువురు రైతులు ఏళ్ల తరబడి అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే గిరిజనులకు మాత్రమే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేయడంతో ఎస్సీ, ఓబీసీ రైతుల పోడు భూములు అటవీశాఖ కబ్జాకు గురవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్య ప్రభావిత వర్గాలలో గణనీయమైన అసంతృప్తికి దారితీసింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న అవినీతిపరుడు. మున్నూరు కాపులను మోసం చేసిన వ్యక్తి. బీజేపీ అధికారంలోకి వస్తే మున్నూరుకాపుల భవనానికి 3 ఎకరాల స్థలం కేటాయిస్తాం.
శివాజీ అవుతారా.. బాబర్ అవుతారా?
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నా విజ్ఝప్తి ఒక్కటే. పోరాడేవాళ్లకు ఓట్లేసి గెలిపించకపోతే.. భవిష్యత్తులో ఏ పార్టీ కూడా పేదల పక్షాన కొట్లాడే అవకాశమే లేదు. కులాల పేరుతో రాజకీయం చేసి ఓట్లు దండుకుని ఆ కులాలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దే. తెలంగాణలోని బీసీలన్నీ బీజేపీకే ఓటేయబోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే సీఎం కాబోతున్నారు. కేసీఆర్ మనిషివైతే ఆయన నిజమైన హిందువైతే ఒవైసీకి బొట్టుపెట్టి హనుమాన్ చాలీసా చదివించాలి. ఆదిలాబాద్ హిందువులకు నేను చెప్పేదొక్కటే... ఆదిలాబాద్ యువకులారా... శివాజీ అవుతారా.... బాబర్ అవుతారా తేల్చుకోవాల్సిందే.. భూకబ్జాదారులపై బుల్డోజర్లు దించే ప్రభుత్వం కావాలా? ప్రజలెటు పోతే నాకేంది... నేను సంపాదించుకోవడమే ముఖ్యం అనుకునే వాళ్లు కావాలా? తేల్చుకోండి. ప్రతి ఇంటి నుండి ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, కొమరం బీం, అంబేద్కర్ వస్తే తప్ప హిందువుల బతికి బట్టకట్టే పరిస్థితి లేదు.. ఏ సర్వే చూసినా ఆదిలాబాద్ పై ఎగిరేది కాషాయజెండానే...రంగు రంగుల జెండాలన్నీ కాషాయ కాంతులకు మాడిమసైపోవడం తథ్యం’’ అని బండి సంజయ్ అన్నారు.