Money Seized During Five States Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కఠినంగా వ్యవహరిస్తోంది. ఓటర్లకు ప్రలోభాల విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసుల సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా భారీగా అక్రమ నగదు పట్టుబడింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.1760 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది. 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో సీజ్ చేసిన దాంతో పోలిస్తే దీని విలువ ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో రూ.239.15 కోట్లు పట్టుబడినట్లు తెలిపింది. అయితే, తెలంగాణలోనే అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు వివరించింది. రాజస్థాన్ లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్ లో రూ.323.7 కోట్లు, ఛత్తీస్ గఢ్ లో రూ.76.9 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది.
ఆ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్ లో, 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తనిఖీల సందర్భంగా తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. మిజోరంలో ఎలాంటి నగదు దొరకలేదని, కానీ రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువుల ఉన్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. వీటిని సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ సీఎంకి ప్రధాని మోదీ ఫోన్ కాల్, రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా