Ex Mp Ramesh Rathod Passed Away: ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ (Ramesh Rathod) (59) శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించాలని భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) తరలిస్తుండగా మార్గమధ్యలో ఇచ్చోడ వద్ద తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రమేష్ రాథోడ్ పార్ధీవ దేహాన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు.
ఇదీ రాజకీయ ప్రస్థానం
రమేశ్ రాథోడ్ సాధారణ స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. 1999లో తొలిసారిగా టీడీపీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ఆ పార్టీ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఇదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అనంతర మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జూన్ 2021లో ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీలో చేరారు. ఎంపీ టికెట్ కోసం యత్నించారు.
బండి సంజయ్ సంతాపం
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. 'గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఇద్దరు నేతలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు