Voadfone Idea Hikes Mobile Recharge Plan Rates: మన దేశంలోని టెలికాం సేవల సంస్థలు సామాన్య జనానికి వరుసబెట్టి షాక్‌లు ఇస్తున్నాయి. వంతుల వారీగా, ఒక్కో రోజు ఒక్కో టెలికాం కంపెనీ రీఛార్జ్ రేట్లు పెంచుతూ జనం బడ్జెట్ మీద భారం పెడుతున్నాయి.
రీఛార్జ్ రేట్లు పెంచిన వొడాపోన్ ఐడియా
రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ తర్వాత దేశంలో మూడో అతి పెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్‌లు పెంచింది. ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ విభాగాల్లో మొబైల్ ప్లాన్ రేట్లను 10 నుంచి 21 శాతం వరకు పెంచాలని ఈ సర్వీస్ ప్రొవైడర్ నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా కొత్త మొబైల్ టారిఫ్‌లు జులై 04, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.
టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ఫైలింగ్‌లో వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఎంట్రీ లెవల్ యూజర్లపై (చిన్న వినియోగదార్లు) భారం పెంచకూడదన్న సూత్రానికి కంపెనీ కట్టుబడి ఉందని, ఎంట్రీ లెవల్ ధరల పెంపు నామమాత్రమేనని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. అయితే, పెద్ద మొత్తంలో రీఛార్జ్ చేసుకునే వినియోగదార్ల విషయంలో రేట్ల పెంపు ఎక్కువగా ఉంటుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వొడాఫోన్ ఐడియా ప్రకటించింది.
వొడాపోన్ ఐడియా కొత్త రేట్లు
వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపును పరిశీలిస్తే.... రూ.179 ప్లాన్ కోసం కస్టమర్లు జులై 04వ తేదీ నుంచి రూ. 199 చెల్లించాలి. రూ. 459 ప్లాన్ కోసం అదే తేదీ నుంచి రూ. 509 ఖర్చు చేయాలి. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ. 1799 ప్లాన్ కోసం యూజర్లకు అదనంగా మరో రూ. 200 ఖర్చవుతుంది. ఈ ప్లాన్ కోసం వచ్చే నెల 04 నుంచి రూ. 1999 చెల్లించాలి.
పోస్ట్‌పెయిడ్ విభాగంలో... 401 రూపాయల ప్లాన్ కోసం జులై 04వ తేదీ నుంచి 451 రూపాయలు; 501 రూపాయల ప్లాన్ కోసం 551 రూపాయలు; 601 రూపాయల ఫ్యామిలీ ప్లాన్ కోసం 701 రూపాయలు; 1001 రూపాయల ఫ్యామిలీ ప్లాన్ కోసం 1201 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రి-పెయిడ్ కస్టమర్లకు రాత్రి పూట ఉచిత డేటాను అందిస్తున్న ఏకైక ఆపరేటర్ తామేనని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. 4G విస్తృతంగా పెట్టుబడులు పెట్టబోతున్నామని, 5G మొబైల్ సర్వీస్‌లను ప్రారంభించబోతున్నామని తెలిపింది.
గురువారం నాడు, మొబైల్ టారిఫ్‌లు పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తొలి కంపెనీ ఇదే. దీని ధరలు 12 శాతం నుంచి 27 వరకు పెరిగాయి, ఇవి వచ్చే నెల 03వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత, శుక్రవారం ఉదయం, భారతి ఎయిర్‌టెల్ కూడా తన టారిఫ్‌లను 10 శాతం నుంచి 21 శాతం వరకు పెంచింది. ఈ రేట్లు కూడా జులై 03 నుంచి అమలులోకి వస్తాయి.
వాస్తవానికి... 2021 డిసెంబర్ నుంచి టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లు పెంచలేదు. అయితే, ఈ మధ్యకాలంలో 5G స్పెక్ట్రమ్ కొనుగోలు చేసి, దేశవ్యాప్తంగా 5G సేవలు ప్రారంభించాయి. దీనికోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు, వొడాఫోన్ ఐడియా కూడా 5జీ సేవలు ప్రారంభించబోతోంది. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి కాబట్టి, ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి టారిఫ్‌లను పెంచుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నాటికే రేట్లను పెంచాల్సి ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాయి. ఎలక్షన్లు ముగియగానే టారిఫ్‌లు పెంచాయి.
మరో ఆసక్తికర కథనం: మొబైల్ రీచార్జ్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు, జులైలో చాలా మార్పులు - తెలుసుకోకపోతే నష్టపోతారు!