ACB Caught Shamirpet MRO While Taking Bribe: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా.. బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు సదరు అధికారి పని పట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన రామశేషగిరిరావుకు షామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్పేట్ గ్రామంలో 29 ఎకరాల భూమి ఉంది. తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పాస్ పుస్తకం జారీ చేసేందుకు ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశారు. దీంతో రామశేషగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బాధితుడు.. ఎమ్మార్వో సత్యనారాయణకు డబ్బు సిద్ధం అయ్యాయని సమాచారం ఇచ్చాడు. మంగళవారం ఎమ్మార్వో డ్రైవర్ బద్రి రూ.10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తహసీల్దార్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.


Also Read: CM Revanth Reddy: మేడిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ బృందం - కుంగిన పిల్లర్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు