ABP Southern Rising Summit 2024 | హైదరాబాద్: JustAsking అని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేశారు. దీనిపై ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నలు ఎందుకు అడగతారంటే.. సమాధానాలు చెప్పని ప్రశ్నలే అడుగుతానని క్లారిటీ ఇచ్చారు. మిగతా నటులు తమ సినిమాలతో, పనులతో బిజీగా ఉంటున్నారు. అయితే తాను మాత్రం అలా మౌనంగా ఉండలేనని, ఎందుకంటే తాను జీవించి ఉన్నానని ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన చేపలా ప్రవాహంలో తాను కొట్టుకుపోలేనని, అలలకు ఎదురీదే తత్త్వం తనదన్నారు.
‘నేను ఆర్టిస్టును. కేవలం టాలెంట్ వల్లే నేను నటుడిగా కొనసాగడం లేదు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, వారు నాపై చూపిన ప్రేమ కూడా కారణం. అందుకోసం నేను మిగతావారిలా సైలెంట్ లా ఉండలేను. ప్రజల గొంతుకగా నేను ఉంటానని వారు నమ్ముతున్నారు. నేరాలు చేసిన వాళ్లనైనా చరిత్ర మరిచిపోతుంది, కానీ తప్పులను చూస్తున్నా నోరు మెదపని వారిని ఎవరూ క్షమించరు’ అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాలేజీ రోజుల్లో రైటర్స్, థింకర్స్ ను చాలా మందిని కలిశాను. గొప్ప ఎడిటర్ లంకేష్ ను కలిశాను. థియేటర్ ఆర్టిస్టులను కలిసి పనిచేశాను. పక్షుల కిలకిలలు వింటే ఏం రాయాలో నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీ వాయిస్ గట్టిగా వినిపిస్తే ప్రపంచానికి సమస్య ఏంటో తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు లేవనెత్తడంతో సమస్యలు వచ్చాయి. కానీ వాటిని నేను పట్టించుకోను. గౌరీ, సిద్ధార్థ్ లాంటి స్నేహితుల విషాధాలు నాకు ఉన్నాయి. వ్యక్తిగత విషయాలను చూపించి, సమాజాన్ని వదిలేయలేను. కొన్ని విషయాలు నన్ను బాధ పెట్టాయి. ఒంటరిని చేస్తాయి. వాటిని అధిగమించి పోరాడినప్పుడే మనం ఏంటో అందరికీ తెలుస్తుంది.
డైరెక్టర్లు, అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నాను
కమర్షియల్ మాత్రమే కాదు సబ్జెక్ట్ ఉన్న సినిమాల్లో కూడా నటిస్తాను. సింగం, ఒక్కటు, కాంజీవరం ఇలా ఏ సినిమా ఛాన్స్ వచ్చినా చేస్తాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు ధన్యావాదాలు. నాపై నమ్మకం ఉంచిన, నన్ను ప్రేమించే వారికి థ్యాంక్స్. బాలచందర్, మణిరత్నం, కృష్ణవంశీ, వెట్రి మారన్ లాంటి గొప్ప దర్శకుల డైరెక్షన్ లో సినిమాలు చేయడం గొప్పగా భావిస్తా. వారు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొందరు నాపై ఏదైనా ప్రచారం చేస్తుంటారు. కానీ నేను లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, సెంట్రిస్ట్ కూడా కాదు. నేను డౌన్ టు ఎర్త్. గళం ఎత్తలేని వారికి గళంగా మారతాను. వాక్ స్వాతంత్ర్యపు హక్కును లాక్కోవాలని చూస్తున్నారు. ప్రశ్నించడాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఇలాంటి కారణాలతో సినిమా అవకాశాలు కోల్పోయాడని ప్రచారం చేస్తారు. నిజం అనేది ముఖ్యం. వారి కంటే ఎక్కువగా కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కొంత మనీ కోల్పోతాను అంతే - ప్రకాష్ రాజ్
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు..
తనపై ఎందుకు కొందరు కామెంట్లు చేస్తారు, దుష్ప్రచారం అన్న విషయంపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తెలుగు సామెత పండ్లున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు అని చెప్పడంతో అంతా చప్పట్లు కొట్టారు. ఒక్క చేతితో చప్పట్లు కొట్టలేం. కొన్నిసార్లు వాళ్లది తప్పు కావొచ్చు, మరికొన్ని సందర్భాలలో తన వైపు కూడా తప్పు జరిగే అవకాశం ఉందన్నారు. భిన్నాభిప్రాయాల వల్ల ఇలా జరుగుతుంది. నేను కర్ణాటక వాడ్ని. కన్నడిగను. కానీ ఎక్కడికి వెళ్లినా నన్ను బయటి వాడిగా పరిగణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో పని చేయడం చాలా కష్టం. నామీద ఎన్ని కుట్రలు చేసినా, వెనక్కి లాగే ప్రయత్నం చేసినా తట్టుకుని నిల్చున్నాను.
కొడైలో, చెన్నైలో, మైసూరులో, హైదరాబాద్ లో నాకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. నాకు ఏ నగరాలలో బిల్డింగ్స్ లేవు. కానీ వ్యవసాయ పొలాలు, భూములు ఉన్నాయి. ప్రకృతికి ఆక్సిజన్ అందిస్తున్నాను. కొడైలో అవకాడో, పెప్పర్.. హైదరాబాద్ లో మామిడి, మైసూరులో థియేటర్ ఇంక్యుబేటింగ్ సెంటర్, వచ్చే తరాలకు సినిమాకు సంబంధించి ఏదైనా చేయాలని ఇది ఏర్పాటు చేశా. ఎడ్యుకేషన్ లో థియేటర్ అనేది సబ్జెక్టుగా నేర్పించాలని భావిస్తున్న. డిసెంబర్ లో నేషనల్ సెమినార్ ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి థియేటర్ స్టడీస్ కు సంబంధించి ఓ కరిక్యూలమ్ రెడీ అవుతుంది. ఎడ్యుకేషన్ లో థియేటర్ (సినిమా) ప్రాముఖ్యతను ప్రభుత్వానికి తెలిసేలా చేస్తాం. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు.
Also Read: Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై