BRS MLA Palla Rajeshwar Reddy : భారత రాష్ట్ర సమితికి చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శలు చేస్తుండగా.. తాజాగా అదే పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యేపై కేసు నమోదయింది.


మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆక్రమించిన ఈ స్థలంలో అనురాగ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈ పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సంస్థ చైర్మన్ గా ఉన్న రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యేకు సమాచారాన్ని అందించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెడుతోందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేసిన ఎమ్మెల్యే 


హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి విచారణ సందర్భంగా హైకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనను, అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత కక్షపూరితంగా వ్యవహరించిన తాను మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణానికి చట్ట ప్రకారం అన్ని అనుమతులు తెచ్చుకున్నట్లు వెల్లడించారు. 2024 ఆగస్టు 22న ఇరిగేషన్ ఇంజనీర్ తమ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించారని, మరుసటి రోజు గాయత్రి ట్రస్టు, అనురాగ్ సంస్థలు నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు తమను కనీసం సమాచారం అడగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించారు.


అనుమతి లేకుండా నిర్మాణాలు చేయలేదు 


గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు గడిచిన 25 ఏళ్లలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టలేదని వెల్లడించారు. గతంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి పరిశీలించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో లేవంటూ ఎన్వోసీ ఇచ్చారన్నారు. 2018లో అప్పటి మేడ్చల్ కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ వేసి పరిశీలించిన తర్వాతే ఎన్వోసీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్ పోర్ట్ అథారిటీలు అన్నీ ఎన్వోసీలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అన్ని శాఖల అనుమతులను పరిశీలించిన తర్వాతే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. 


కాంగ్రెస్ ప్రభుత్వం తనపై, తన సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపించారు. జనగామలో వ్యక్తిగతంగా తనపై నాలుగు కేసులు, హైదరాబాదులో రెండు కేసులు పెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనురాగ్ యూనివర్సిటీపై అన్ని శాఖలతో నిత్యం సోదాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఏమి దొరకకపోవడంతోనే 2017లో అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనపై మరో కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా చట్ట పరిధిలో న్యాయం కోసం పోరాటం చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.