Minister Ponguleti : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు జాతీయ రహదారులు జలమయం కాగా, కొన్ని చోట్ల వరదలు రావడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని రామాపురం, చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి భారీగా వరద ప్రవాహం కిందికి ప్రవహించడంతో..  జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు నల్ల బండగూడెం వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద తగ్గిన తర్వాతే వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో పదుల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి.


దంచికొడుతున్న వాన 
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్ద అవుతోంది. ఈనేపథ్యంలో తాజాగా వాతావరణశాఖ వెదర్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, గద్వాల, ఖమ్మం, అసిఫాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కమ్మేసింది.


తొమ్మిది మంది మృతి
 తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలో తొమ్మిది మంది మరణించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.


బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు..
 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద పాలేరు వాగులో దంపతులు గల్లంతయ్యారు. మున్నేరు వరద బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నంలో నేవీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లను ఖమ్మం నగరానికి పంపాలని కోరారు. కోదాడలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుకున్న వారిని బోట్లల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం తాళ్ళపూసపల్లి శివారులో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
Also Read: Khammam Rains: ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న ప్రకాష్ నగర్ వాసులు, ఏపీ నుంచి రంగంలోకి దిగిన 2 హెలికాప్టర్లు


సీఎం సమీక్ష
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులు సెలవు రద్దు చేసుకుని... వరద సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలన్నారు.
 


Also Read: Telangana News: తెలంగాణలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, భారీ వర్షాల్లో రెస్క్యూ ఆపరేషన్స్