గడిచిన 24 గంటల వ్యవధిలో 21 వేల 679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో కొత్తగా 274 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,489కి చేరింది. వైరస్ కారణంగా మరోకరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,030కి చేరింది. కరోనా నుంచి 227 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఎట్ రిస్క్ దేశాల నుంచి 24 గంటల వ్యవధిలో.. 163 మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే వారికి.. కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయగా 14 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపంగా.. 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84 అయ్యాయి. అందులో 32 మంది కోలుకున్నారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి 12855 మంది ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కరోనా మూడో వేవ్ ప్రారంభం అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటి రేటు ప్రస్తుతం క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో 0.5 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తాజాగా ఒక శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. డిసెంబర్ 26వ తేదీన రాష్ట్రంలో 109 కరోనా కేసులు ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ జనవరి 1వ తేదీకి 317కి చేరింది. రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కొద్ది రోజుల క్రితం ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 10వ తేదీ వరకు తెలంగాణలో బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన సభలపై నిషేధం విధించారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బీఆర్కేఆర్ భవన్‌లో వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు.
అంతేకాకుండా కరోనా నిబంధనల్లో భాగంగా మాస్క్‌లను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని పాఠశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కేసులు పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులకు కూడా జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. జవవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుంచి 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వేయనున్నారు.