Rs 500 for Gas cylinder Rythu Bandhu by March 15: కోస్గి: వచ్చే వారం రోజుల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై ఆదేశాలు జారీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గం కోడంగల్ (Kodangal) కు రేవంత్ రెడ్డి బుధవారం నాడు వెళ్లారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా అన్నారు. 


కేసీఆర్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్న రేవంత్.. 
ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు.. ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ను అడుగుతున్నా.. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు పాలమూరుకు చేసిందేంటి? పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? అని మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని, ప్రజలు ఛీకొట్టినా  కేసీఆర్ కు సిగ్గు రాలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మొహం పెట్టుకుని పాలమూరు జిల్లాకు వస్తారు? పాలమూరును ఎండబెట్టి.. కొడంగల్ ను పడావు పెట్టి ఎడారి చేశారంటూ మండిపడ్డారు.



ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం.. 
వచ్చే వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తాం, వచ్చే నెల 16లోగా అందరికీ రైతు భరోసా అందిస్తామని భరోసా ఇచ్చారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2014లో తాను మంజూరు చేయించుకొచ్చానని తెలిపారు. 70 ఏండ్ల మన గోస తీరుస్తానని మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన మాటను ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నా అన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేట్- కొడంగల్ పథకాన్ని పదేండ్లు పడావు పెట్టిందని, కొమ్మోడి వెంబడి సన్నాయివాడు పడినట్లు బీజేపీ వైఖరి ఉందంటూ సెటైర్లు వేశారు.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014లో మోడీ ఇచ్చారు. పదేండ్లుగా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో తెలంగాణ బీజేపీ నేతలు డీకే అరుణ, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కృష్ణా రైల్వే లైన్  ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా... నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి నాలుగు రూపాయలైనా తెచ్చారా? మరి పాలమూరు జిల్లాలో ప్రజలను ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు? అంటూ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.


‘కృష్ణా జలాలు కొడంగల్ రైతులకు అందేంచే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ ఇవ్వండి. మళ్లీ 5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఇదివిరామం మాత్రమే.. ఇంకా యుద్ధం ముగిసిపోలేదని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలోని 17లో 14 ఎంపీ స్థానాలు గెలిచినపుడే.. పార్లమెంట్ లో మనం పట్టు సాధించినపుడే యుద్ధం గెలిచినట్టు’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.