Yashasvi Jaiswal, Ravindra Jadeja and Rohit Sharma moved up in ICC Test rankings: ఇంగ్లాండ్‌(England)తో జ‌రుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా(Team India) యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్(ashasvi Jaiswal) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. వరుస మ్యాచుల్లో రెండు ద్వి శతకాలు బాది భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ.. ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా నుంచి కోహ్లి మాత్రమే టాప్‌-10లో కొన‌సాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోయినా విరాట్‌ కోహ్లీ 752 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. రాజ్‌కోట్‌లో సెంచ‌రీ చేసిన‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 34వ స్థానానికి ఎగబాకాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ( Rohit Sharma) ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని 12వ ర్యాంకులో ఉన్నాడు. వరుస శతకాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కివీస్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో స్టీవ్ స్మిత్, మూడో స్థానంలో డారిల్ మిచెల్, నాలుగో స్థానంలో బాబ‌ర్ ఆజాం, అయిదో స్థానంలో జో రూట్‌ ఉన్నారు. 

 

బౌలింగ్‌లో తొలి రెండు స్థానాలు మనవే

రాజ్‌కోట్ మ్యాచ్‌లో 500 టెస్టు వికెట్ల మైలురాయిని సాధించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Aswin)టెస్ట్ బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. స్టార్ పేస‌ర్ జస్‌ప్రీత్ బుమ్రా(Bumrah) 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు. ర‌వీండ్ర జ‌డేజా మూడు స్థానాలు ఎగ‌బాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. రబాడ మూడో స్థానంలో కమిన్స్‌ నాలుగో స్థానంలో... హేజిల్‌ వుట్‌ అయిదో స్థానంలో ఉన్నారు. 

 

జైస్వాల్‌ విధ్వంసం..

భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా(Team India)నయా సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. అసలు బజ్‌బాల్‌ ఆటంటే ఏంటో ఇంగ్లాండ్‌ జట్టుకు తెలుసొచ్చేలా చేశాడు. వన్డే తరహా ఆట తీరుతో బ్రిటీష్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్‌... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ నాలుగో టెస్ట్‌కు దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లే.

 

వెన్నునొప్పే కారణమా..?

యశస్వీ జైశ్వాల్‌ గాయం కారణంగా రాంచీ టెస్ట్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైశ్వాల్‌ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతూనే యశస్వీ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. వెన్ను నొప్పి కారణంగా మూడో రోజు ఆటలో సెంచరీ పూర్తిచేశాక రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగిన జైశ్వాల్‌.. మళ్లీ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి తన రెండో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు కూడా జైస్వాల్‌ ఆసౌక్యర్యంగా కన్పించాడు. ఈ క్రమంలో అతడికి రాంచీ టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెన్‌జ్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జైస్వాల్‌ నాలుగో టెస్ట్‌కు దూరమైతే దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ అరంగేట్రం జరిగే అవకాశం ఉంది.