Telangana Griha Jyoti Scheme: ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ... ఆ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తోంది. మరో రెండు హామీల అమలు చేసేందుకు కసరత్తు  చేస్తోంది. అమలు చేయబోతున్న రెండు హామీల్లో ఒకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. ఆ హామీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం... కొన్ని షరతులు పెడుతోంది. ఉచిత విద్యుత్‌ పొందాలంటే.. తెల్ల రేషన్ కార్డును  తప్పనిసరి చేసింది. అంతేకాదు.. రేషన్‌కార్డు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానమైన కరెంటు కనెక్షన్లు ఉన్న ఇళ్లకు మాత్రమే తొలిదశలో 200 యూనిట్ల ఉచిత్‌ విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు  ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా... విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. 


గ్యారెంటీ పథకాల అమలు కోసం... జనవరిలో దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఆరు గ్యారెంటీలకు ఒకే ధరఖాస్తు తయారు చేసి ఇచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామసభలు పెట్టి... ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఇందులో  82లక్షల మంది ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10లక్షల మందికి రేషన్‌కార్డులు లేవు. వీరికి తొలిదశలో ఉచిత విద్యుత్‌ సరఫరా సాధ్యం కాదు. వీరికి పక్కన పెడితే... మిగిలిన 72లక్షల మందిలో 30 శాతం మంది రేషన్‌కార్డు,  ఆధార్‌, సెల్‌ఫోన్‌ నెంబర్లు సరిగా నమోదు చేయలేదు. నిన్నటి (ఫిబ్రవరి 7వ తేదీ) నుంచి ఇంటింటికీ వెళ్తున్న విద్యుత్‌ సిబ్బంది... ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌ విషయానికి వస్తే.... గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లు... నెలకు 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడుతున్నవే. అయితే... ఇందులో 20లక్షల మంది మాత్రమే ఉచిత  కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10లక్షల మంది దరఖాస్తు చేసుకోలేదు. ఉచిత విద్యుత్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 20లక్షల మందిలో 5 లక్షల మంది రేషన్‌ కార్డు వివరాలు ఇవ్వలేదు. వీటిని సరిచేసేందుకు విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ  వెళ్తున్నారు. రేషన్‌, ఆధార్‌తోపాటు ఫోన్‌ నెంబర్‌ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలన్న లెక్క తేలుతుంది. 


ఇక... ఉచిత్ విద్యుత్‌ స్కీమ్‌ వర్తించాలంటే.. 200 యూనిట్ల లోపే విద్యుత్‌ వినియోగించి ఉండాలి. 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి 2,181 యూనిట్ల లోపే కరెంట్‌ వాడుండాలి. గత ఏడాది 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు.... ఇప్పుడు నెలకు  ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్ల వరకే వాడుంటే... దానికి పది శాతం కోటా కింద 9 యూనిట్లు కలిపి.. మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో  అమలవుతోంది. ఇక్కడ కూడా దాన్నే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ భావిస్తోంది. దీంతోపాటు.... ఒక ఇంటికి ఒక మీటర్‌ ఉన్న వారికే ఉచిత విద్యుత్‌ స్కీమ్‌ అమలు చేయాలన్న నిబంధన కూడా పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నిబంధన  పెడితే... అద్దె ఇళ్లలో ఉండే వారికి లబ్దిజరగకపోవచ్చు. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్దిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్‌కు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధానంలో కరెంట్ ఫ్రీగా ఇచ్చే  లబ్దిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు.


మరోవైపు... ఉచిత కరెంట్‌ లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జీవో జారీచేయబోతోంది. జీవో విడుదలైతే దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక... నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో  నమోదు చేయడానికి డిస్కంలు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.