ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రస్తుతం చాలా మందికి రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. అలసటగా ఉండి వంట చేసుకునే ఓపిక లేనప్పుడు ఒక్క క్లిక్‌తో ఫుడ్ మన ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఏ యాప్ తీసుకున్నా ఫుడ్ ఆర్డర్ పెడితే రావడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ఈలోపు మనకు ఆకలి, అసహనం పెరిగిపోవడమో, చచ్చిపోవడమో జరుగుతుంది. దీనికి జొమాటో ఒక పరిష్కారంతో ముందుకు వచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేసే ఇన్‌స్టంట్ ఆప్షన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జొమాటో ప్రకటించింది.


దీనికి సంబంధించిన ఒక ప్రకటనను కూడా జొమాటో విడుదల చేసింది. 10 నిమిషాల్లోనే డెలివరీ కోసం డెలివరీ పార్ట్‌నర్లపై ఎటువంటి ఒత్తిడీ పెట్టబోమని తెలిపింది. ఆలస్యంగా డెలివరీ చేసినందుకు వారిపై ఎటువంటి పెనాల్టీ కూడా విధించబోమని పేర్కొంది. టైం ఆప్టిమైజేషన్ ప్రక్రియ రోడ్డు మీద జరగబోదని తెలిపింది.


మరి 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?
ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఇలా చేయలేదు. ఈ ఫీట్ సాధించే మొదటి కంపెనీగా ఉండటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాం. జొమాటో ఇన్‌స్టంట్‌ను సాధించడానికి ఎనిమిది నిబంధనలను పాటించనున్నాం. అవేంటంటే...


1. ఇంటి ఆహారం వండటానికి అయ్యే ధరకే అందించడం (దాదాపుగా)
2.అత్యధిక నాణ్యతతో తాజా ఆహారం
3. ప్రపంచ స్థాయి పారిశుధ్య విధానాలు
4. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను వీలైనంత తక్కువ ఉపయోగించడం
5. సులభంగా తినడానికి వీలయ్యే కన్వీనెంట్ ప్యాకేజీ
6. ట్రేస్ చేయడానికి వీలయ్యే సప్లై చైన్
7. డెలివరీ పార్ట్‌నర్ భద్రత
8. రెస్టారెంట్ పార్ట్‌నర్లతో మరింత మెరుగ్గా భాగస్వామ్యం


దీని కోసం జొమాటో ఫినిషింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. వేర్వేరు రెస్టారెంట్లలో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ (సుమారు 20 నుంచి 30 వంటకాలు) ఇందులో ఉండనున్నాయి. డిమాండ్ ప్రెడిక్టబులిటీ (డిమాండ్‌ను అంచనా వేయడం), స్థానికంగా ఎక్కువ అమ్ముడయ్యే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ద్వారా దీన్ని సాధిస్తామని జొమాటో అంటోంది. దీంతో ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గనున్నాయి.