బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కంగనా రనౌత్ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రబృందాన్ని ప్రత్యేకంగా కలిశారు. దర్శకనిర్మాతలు పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 


ఈ సినిమా మత దురభిమానం, టెర్రరిజం లాంటి భయంకరమైన విషయాలను బయటపెట్టింది. కచ్చితంగా ఈ సినిమా సమాజాన్ని, దేశాన్ని జాగృతం చేసేలా పని చేస్తుంది. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.






సినిమా కథ గురించి చెప్పాలంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.