పెగాసస్ స్పైవేర్ ( Pegasus ) అంశంపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీని ( house Commiite ) నియమిస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విపక్ సభ్యులను ఉదయమే సస్పెండ్ చేయడంతో సభలో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) సభ్యులు మాత్రమే ఉన్నారు. సభా కమిటీకి అందరూ అంగీకరించడంతో ఆ మేరకు స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. రెండు రోజుల్లో సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది.
చంద్రబాబు కొనుగోలు చేశారని మమతా బెనర్జీ చెప్పారన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు !
చంద్రబాబు ( Chandrababu ) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పినట్లుగా చెబుతున్న వార్తలపై ఏపీ అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. ఉదయం టీడీపీ సభ్యులను సస్పెండ్ ( Suspend ) చేసిన తర్వాత పెగాసస్ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు కోరారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. ఆ తర్వాత పలువురు వైఎస్ఆర్‌సీపీ సభ్యులు మాట్లాడారు. మమతా బెనర్జీ సమాచారం లేకుండా మాట్లాడరు కదా అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మంత్రి ఆదిమూలపు సురేష్, గడికోట శ్రీకాంంత్ రెడ్డి వంటి సభ్యులు మాట్లాడారు. అందరూ విచారణకు డిమాండ్ చేశారు.
అనైతికంగా చేశారు కాబట్టి రుజువులు ఉండవన్న మంత్రి బుగ్గన !
సభాసంఘం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెట్టే ముందు ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( Buggana ) మాట్లాడారు. చంద్రబాబు స్పైవేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ చెప్పారని ఆయన కూడా పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలు చేశారని విమర్శించారు. స్పైవేర్‌ను అనైతిక చర్యలకు వాడతారు కాబట్టి .. అనైతికంగా చేశారు కాబట్టి రుజువులు ఉండవని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. పెగాసస్ అంశంపై సభ్యుల్లో ఆందోళన ఉందని మంత్రి తెలిపారు. పెగాసస్‌తో ఏమేమి చేశారో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
ఎలాంటి విచారణకైనా సిద్ధమని నారా లోకేష్ సవాల్!
పెగాసస్ అంశంపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని టీడీపీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) సవాల్ చేశారు. అసలు చంద్రబాబు స్పైవేర్ కొన్నారని మమతా బెనర్జీ ( Mamata Benarjee ) అన్నారో లేదో ఎవరికీ తెలియదన్నారు. అసెంబ్లీలో అన్నారని చెబుతున్న వీడియో బెంగాలీలోలో ఉందని.. బెంగాలీ భాష తెలిసిన వాళ్లు.. అసలు అందులో పెగాసస్ అంశంపైనే మాట్లాడలేదని చెబుతున్నారన్నారు.