Youtube Playables Feature: యూట్యూబ్ తన ప్లేయబుల్స్ ఫీచర్‌ను అందరు యూజర్లకు రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యూట్యూబ్‌లోనే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేయబుల్స్ సర్వీసును 2023 నవంబర్‌లో మొదటగా 30 ఆర్కేడ్ గేమ్స్‌తో పరిచయం చేశారు. ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. కానీ మార్చి 28వ తేదీ తర్వాత దీన్ని అందరు యూజర్లకు ఉచితంగా మార్చారు. ఇప్పుడు దీన్ని ఆడటానికి ఎటువంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.


ప్లేయబుల్స్ లైవ్ అయిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా బ్లాగ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ‘యూట్యూబ్‌లో మీరు డైరెక్ట్‌గా ఆడగల ఫ్రీ గేమ్స్ కలెక్షన్ ఇది.’ అని బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీన్ని అందరు యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్లేయబుల్స్ సెక్షన్‌లో వినియోగదారులు 75 గేమ్స్ ఆడగలరు. దీనికి ఎటువంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.


అయితే ఈ రోల్ అవుట్ దశల వారీగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొంతమంది యూజర్లకు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు మాత్రం గేమ్ ట్రే ఐకాన్ కనిపించడం లేదు. దీన్ని బట్టి దశలవారీగా ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని అనుకోవచ్చు.


Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో


గేమ్స్ ఎలా ఆడాలి?
యూట్యూబ్‌లో ఉచితంగా గేమ్స్ ఆడాలంటే ముందుగా ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ సర్వీసుల్లో యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఎక్స్‌ప్లోర్ మెనూలో ప్లేయబుల్స్ సెక్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో 75 గేమ్స్ ఉన్నాయని యూట్యూబ్ తెలిపింది. వీటిలో ఆంగ్రీ బర్డ్స్ షోడౌన్, వర్డ్స్ ఆఫ్ వండర్స్, కట్ ది నేమ్, టూంబ్ ఆఫ్ ది మాస్క్, ట్రివియా క్రాక్ వంటి గేమ్స్ ఉన్నాయి.


తన స్వంత గేమింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన ఎన్నో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల్లో యూట్యూబ్ కూడా ఒకటి. 2021 నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ కూడా తన స్వంత గేమింగ్ ప్లాట్‌పాంను లాంచ్ చేసింది. ఇందులో గ్రాండ్ థెప్ట్ ఆటో: ది ట్రయాలజీ - ది డెఫినిటివ్ ఎడిషన్, స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్, ఫుట్‌బాల్ మేనేజర్ 2024 మొబైల్ వంటి ఎన్నో గేమ్స్ ఉన్నాయి. 


యాడ్ బ్లాకర్స్‌పై పని చేస్తున్న యూట్యూబ్
యూట్యూబ్ మరోవైపు యాడ్ బ్లాకర్లపై కూడా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. యాడ్ బ్లాకర్లు ఉపయోగిస్తే అవి వీడియోను నేరుగా స్కిప్ చేసి ఎండ్‌కు తీసుకెళ్లిపోతాయి. దీని కారణంగా యూట్యూబ్ ఎంతో రెవిన్యూను నష్టపోతుంది. ఈ కారణంగా యాడ్ బ్లాకర్లకు చెక్ పెట్టడంపై యూట్యూబ్ ఎప్పటి నుంచో పని చేస్తుంది.






Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది