BJP MLA Raja Singh letter to Amith Shah and Telangana DGP over threat calls | హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9.19 నుంచి పలుమార్లు, చాలా నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ తెలిపారు. టెర్రరిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ రాగా, అందులో ప్రైవేట్ నెంబర్ కూడా ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.


టెర్రరిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్..
తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్న నిందితులకు తాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చానన్నారు రాజా సింగ్. అందుకు కారణం చెప్పారు. ధర్మం కోసం పనిచేయకూడదని, మతం మారాలని లేకపోతే తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ హయాంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనూ  ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉందని అరెస్ట్ చేస్తే గతంలో ఎలాంటి అరెస్టులు జరగలేదని, ఒకవేళ ఆ నిందితులు తాను ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ కు ఫోన్ చేసి బెదిరిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దామన్నారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే పోలీసులు పట్టించుకోలేదని, మరి సీఎంకు ఫోన్ కాల్స్ వస్తే అయినా విచారణలో భాగంగా తన విషయం పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.




బెదిరింపు కాల్స్‌పై అమిత్ షాకు, తెలంగాణ డిజీపీకి లేఖలు
ఉగ్రవాదుల నుంచి తనకు బెదిరింపులు రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజా సింగ్ లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని, విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీ రవి గుప్తాకి సైతం రాజాసింగ్ మరో లేఖ రాశారు.