Kartikeya About Bhaje Vaayu Vegam: యంగ్ హీరో కార్తికేయ కెరీర్ మొదట్లోనే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను చవిచూశాడు. కానీ ఆ తర్వాత తన సినిమాలు ఏవీ ఆ రేంజ్‌లో హిట్ అవ్వలేదు. ఇప్పుడు ‘భజే వాయు వేగం’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటించింది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్.. ఈ సినిమాతో చాలాకాలం తర్వాత కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మే 31న విడుదల కానున్న ‘భజే వాయు వేగం’ ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.


ఇన్‌స్పైర్ అవ్వాలి..


‘భజే వాయు వేగం’ కథ విన్నప్పుడు అందులోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు కార్తికేయ. అప్పుడే ఈ సినిమా తాను కచ్చితంగా చేయాలని నిర్ణయించుకొని క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొంత టైమ్ అడిగాడట. ‘‘నేను అప్పటికే 'బెదురులంక' షూటింగ్ మొదలుపెట్టాను. ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ ‘భజే వాయు వేగం’కు వచ్చాను. అందుకే ఈ సినిమాలో కొన్నిచోట్ల జాగ్రత్తగా గమనిస్తే నా హెయిర్ స్టైల్ మారినట్లు తెలుస్తుంది’’ అని బయటపెట్టాడు కార్తికేయ. ‘భజే వాయు వేగం’ ఇప్పుడున్న తన ఇమేజ్‌కు సరైన సినిమా అని కార్తికేయ నమ్మకం వ్యక్తం చేశాడు. ‘‘హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి, ప్రేక్షకులు ఇన్‌స్పైర్ అయ్యేలా ఉండాలి. హీరోగా నాకు సమాజంపై శ్రద్ధ ఉంది. అది నేను చేసే పాత్రలు గమనిస్తే తెలుస్తుంది’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.


ట్విస్టులు ఆశించొద్దు..


‘‘భజే వాయు వేగం కథను ప్రశాంత్ నాకు చెప్పినప్పుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు సమస్య, అతని ధైర్యం.. ఇవన్నీ ఈ కథలో ఉంటాయి’’ అని కార్తికేయ తెలిపాడు. హీరోగా మొదటిసారి యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ‘భజే వాయు వేగం’లో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఆమె క్యారెక్టర్ నుండి ఎలాంటి ట్విస్టులు ఆశించొద్దని, కాకపోతే తనది చాలా ముఖ్యమైన పాత్ర అని ముందే చెప్పేశాడు.


బాధపడడం లేదు..


‘‘నేను స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకోను. కానీ నాకు అనిపించిన అంశాలను చర్చిస్తుంటాను. భజే వాయు వేగం క్రెడిట్ అంతా దర్శకుడిదే. రాహుల్‌ను స్క్రీన్ పై హ్యాపీడేస్ మూవీలో చూశాను. ఆ గౌరవం తనపై ఇప్పటికీ ఉంది. రాహుల్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడంతో కలిసి హ్యాపీగా షూటింగ్ చేశాం. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం’’ అని తెలిపాడు. ఇక తను చేసిన విలన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘గ్యాంగ్ లీడర్, వాలిమైలో విలన్‌గా నటించినందుకు బాధపడడం లేదు. గ్యాంగ్ లీడర్‌లో నటించడం అడ్వాంటేజ్‌గా మారింది. ఆ తర్వాత తెలుగులో విలన్  పాత్రలు వచ్చినా ఏవీ నచ్చలేదు. తమిళంలో విలన్ అవకాశాలు వస్తున్నాయి కానీ తెలుగులో హీరోగా బిజీగా అవ్వడం వల్ల అక్కడ కమిట్ అవ్వలేకపోతున్నాను’’ అని బయటపెట్టాడు కార్తికేయ.


Also Read: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!