ఒకప్పుడు భారత్ లో టిక్ టాక్ ప్రభంజనం సృష్టించింది. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఈ యాప్ ను వినియోగించేవారు. చాలా మంది టిక్ టాక్ వీడియోల ద్వారా సెలబ్రిటీలుగా ఎదిగారు. ఎంతో మంది మానసిక ఉల్లాసం కోసం టిక్ టాక్ వీడియోలను చూసే వారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా టిక్ టాక్ దేశంలో నిషేధించారు. ఆ తర్వాత చాలా మంది ఇన్ స్టా రీల్స్ వైపు మళ్లారు. కొద్ది నెలల క్రితం యూట్యూబ్ కూడా వినియోగదారులను మరింత ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్ షార్ట్స్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్ టాక్ మాదిరిగా కాకపోయినా, ఈ ఫీచర్ బాగానే పాపులర్ అయ్యింది.
టిక్ టాక్ లా మారనున్న యూట్యూబ్ షార్ట్స్
ఇకపై యూట్యూబ్ షార్ట్స్ మరింత ప్రజాదరణ పొందేందుకు యూట్యూబ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే యూట్యూబ్ షార్ట్స్ ను టిక్ టాక్ మాదిరిగా మార్చబోతోంది. తాజాగా యూట్యూబ్ షార్ట్స్ ను చూడటంతో పాటు రూపొందించే ప్రక్రియకు సంబంధించిన ఫీచర్‌లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండటం విశేషం.
మొదటి ఫీచర్‌ను కొల్లాబ్ అని పిలుస్తారు. ఇది టిక్ టాక్ డ్యూయెట్ ఫీచర్ మాదిరిగానే ఉంటుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు ఒరిజినల్ వీడియో పక్కన స్ప్లిట్-స్క్రీన్ ఫార్మాట్ లో వీడియోకు స్పందించేలా వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే iOSలో క్రియేటర్‌లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రాబోతోంది. అటు వర్టికల్ వీడియోలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న సమయంలో మరో పక్కన వారి ఫాలోవర్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫీచర్ టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఉంది. టిక్‌టాక్‌లోని లైవ్ ఫీచర్ లాగా, యూట్యూబ్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నప్పుడు తమ అభిమాన క్రియేటర్స్ కు డబ్బులు పంపించే అవకాశం కూడా కల్పిస్తోంది.
వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్లు
యూట్యూబ్ కొత్త ఎఫెక్ట్స్, స్టిక్కర్స్ ను కూడా యాడ్ చేస్తోంది. అంతేకాదు, టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నటు వంటి Q&A ఫీచర్‌తో సహా, క్రియేటర్స్ తమ వీడియోలకు సంబంధించి వ్యూవర్స్ కామెంట్స్ రూపంలో ప్రశ్నలు అడిగే అవకాశం కల్పిస్తోంది. కొత్త కంటెంట్‌ను రూపొందించడాన్ని మరింత సులభతరం చేసేలా యూట్యూబ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రీమిక్స్ బటన్‌ను క్లిక్ చేయడంతో వారు చూసే షార్ట్స్ ను కొత్త క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్లు ఇప్పటికే టిక్ టాక్‌లో ఉన్నాయి. యూట్యూబ్ రీకంపోజిషన్ టూల్‌తో కూడా ప్రయోగాలు చేస్తోంది. ఇది క్రియేటర్స్ హారిజంటల్ వీడియోలను సులభంగా షార్ట్స్ గా మార్చడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు వీడియో లే అవుట్ ను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. షార్ట్స్ లేఅవుట్‌కు సరిపోయేలా క్లిప్‌ను జూమ్ చేసి క్రాప్ చేసుకోవచ్చని యూట్యూబ్ వెల్లడించింది. మొత్తంగా వినియోగదారులను మరింత ఆకట్టుకునే ఈ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను యూట్యూబ్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial