ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ వినియోగదారులకు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. చాలా కాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఈ ఏడాది(2023) డిసెంబర్ 1 నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ యూజర్లకు గూగుల్ మెయిల్ ద్వారా హెచ్చరిక మెసేజ్ ను పంపించింది. గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కు ఇన్ యాక్టివ్ పరిమితిని 2 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. అంటే, వినియోగదారులు రెండు సంవత్సరాల పాటు గూగుల్ అకౌంట్స్ వినియోగించకపోతే లేదంటే యాక్టివ్ గా ఉంచకపోతే వాటిని పర్మినెంట్ గా తొలగిస్తుంది. అయితే, నేరుగా గూగుల్ అకౌంట్ కి లాగిన్ కాకుండా, గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసుల కోసం గూగుల్ అకౌంట్ ను వినియోగిస్తారో వారికి ఈ తొలగింపు ఉండదని వెల్లడించింది. 


8 నెలల ముందే గూగుల్ నుంచి హెచ్చరికలు


గూగుల్ వినియోగదారులు గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కాకుండా, గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసులను సైతం వినియోగించకుండా రెండు ఏండ్ల పాటు కొనసాగిస్తే అలాంటి అకౌంట్లు కూడా ఎగిరిపోతాయని హెచ్చరించింది. అయితే, గూగుల్ అకౌంట్ డిలీట్ చేయడానికి సుమారు 8 నెలల ముందు నుంచే  వార్నింగ్ మెయిల్స్ పంపనున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ వార్నింగ్ మెయిల్స్ ను కూడా పట్టించుకోకపోతే అప్పుడు సదరు అకౌంట్లను శాశ్వతంగా తొలగిస్తామని తెలిపింది. ఒకసారి గూగుల్ అకౌంట్ డిలీట్ చేస్తే, అదే పేరుతో మళ్లీ కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవడం సాధ్యం కాదని తెలిపింది. అందుకే గూగుల్ అకౌంట్స్ డిలీట్ కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు లాగిన్ కావడం మంచిదని తెలిపింది.


గూగుల్‌ అకౌంట్‌ డిలీట్ కాకుండా ఉండాలంటే? 



  • వీలున్నప్పుడల్లా లాగిన్ అవుతూ ఉండాలి

  • తక్కువలో తక్కువ రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా లాగిన్ చేయాలి.

  • గూగుల్ డ్రైవ్ వాడినా ఫర్వాలేదు

  • మెయిల్ పంపినా, చదివినా అకౌంట్ డిలీట్ కాదు.   

  • యూట్యూబ్‌లో వీడియోలు చూసినా ఫర్వాలేదు.

  • గూగుల్‌ యాప్‌ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్‌ చేసినా అకౌంట్ సేఫ్.

  • ఇతర యాప్స్ ను గూగుల్‌ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసిన అకౌంట్ డిలీట్ కాదు. 


గూగుల్ వన్ సబ్ స్క్రైబర్లకోసం సరికొత్త ఫీచర్


రీసెంట్ గా గూగుల్ భారత్ లో గూగుల్ వన్ సబ్ స్క్రైబర్లకోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.  గూగుల్ డార్క్ వెబ్ రిపోర్ట్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు డేటాను సేఫ్ గా ఉంచుకోవచ్చు. బ్రౌజింగ్ డేటాను కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవచ్చు. సదరు వినియోగదారుల వ్యక్తిగత వివరాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి చిక్కకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది. 


Read Also: గుడ్ న్యూస్ చెప్పిన JIO, ఇకపై ఈ ప్లాన్లకూ ఫ్రీగా Netflix సబ్‌స్క్రిప్షన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial