తక్కువ ధరలో చక్కటి ఎలక్ట్రానిక్ వస్తువులను అందించడంలో ముందుంటుంది చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ. పోటీ కంపెనీలతో పోల్చితే వీలైనంత తక్కువ రేటుకు సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందింది. తాజాగా షావోమీ కంపెనీ భారత్ లో సరికొత్త టాబ్లెట్ ను విడుదల చేసింది. Xiaomi Pad 6 పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే భారత్ లో Xiaomi Pad 5 ఉండగా, దానికి అప్ డేట్ వెర్షన్ గా దీనిని తీసుకొచ్చింది. Xiaomi Pad 5 మాదిరిగానే ఇది కూడా మొత్తం డిజైన్గా రూపొందింది. అంతేకాదు, హైఎండ్ స్పెసిఫికేషన్స్ తో రూపొందింది. Xiaomi Pad 6 బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉండగా, దానికి కంపెనీ మరిన్ని ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ డివైజ్ తో పాటు షావోమీ ఇండియా  రెడ్‌మీ బడ్స్ 4 యాక్టీవ్ అనే ఇయర్ బడ్స్ ను కూడా విడుదల చేసింది. 


Xiaomi Pad 6 ధర ఎంతంటే?


Xiaomi Pad 6  టాబ్లెట్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో ఒకటి 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కాగా, దీని ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. మరొకటి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కాగా, దీని ధర రూ.28,999గా ఫిక్స్ చేసింది. ఈ టాబ్లెట్ ప్రారంభ సేల్ లో భాగంగా ఇన్ స్టంట్ ఆఫర్లు అందిస్తోంది కంపెనీ.  ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో వీటిని కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌ స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. ఈ ఆఫర్‌తో Xiaomi Pad 6   6జీబీ+128జీబీ వేరియంట్‌  రూ.23,999కే లభిస్తుంది.  8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.26,999 కొనుగోలు చేసే అవకాశం ఉంది. Xiaomi Pad 6   సేల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది.






Xiaomi Pad 6 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్


Xiaomi Pad 6  టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇది పూర్తిగా మెటల్ డివైజ్ గా వస్తోంది. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 11 ఇంచుల 2.8K ఎల్‌సీడీ డిస్‌ ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 + MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేయనుంది.   


Xiaomi Pad 6  కెమెరాను పరిశీలిస్తే 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉంది.  8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 8,840mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33 WT ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజులు వాడుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.  క్వాడ్ స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ను పొందుతుంది.  ఇక Xiaomi Pad 6  కొనే వారిని దృష్టిలో పెట్టుకుని  కీబోర్డ్ తో పాటు స్మార్ట్ పెన్ ను అందుబాటులోకి తెచ్చింది. కీబోర్డు ధర రూ.4,999 కాగా, స్మార్ట్ పెన్ ధర రూ.5,999గా కంపెనీ నిర్ణయించింది. టాబ్లెట్ కేస్ ధరను రూ.1,499గా నిర్ణయించింది.


Read Also: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?