భారత ప్రభుత్వం రూ.12 వేలలోపు ధరలో ఉన్న చైనా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్‌లను నిషేధిస్తుందని వార్తలు వస్తున్నాయి. వివో, షావోమీ వంటి బ్రాండ్లు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను ఎగవేస్తూ మనీ లాండరింగ్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ఇది బూస్ట్ ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం నిజంగా దేశీయ బ్రాండ్లకు మేలు చేస్తుందా?
2000 దశకం నుంచి...
మనదేశంలో చైనా ఫోన్ అనే మాట 2007, 2008 సంవత్సరాల నుంచి వినిపించడం ప్రారంభం అయింది. అప్పట్లో రూ.1,000 - రూ.2,000 మధ్యలో మిగతా నోకియా, మోటొరోలా, శాంసంగ్ వంటి కంపెనీలు అందించే ఫోన్లు కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్‌లకు మాత్రమే ఉపయోగపడేవి. కానీ అదే ధరలో వచ్చే వచ్చే చైనా బ్రాండ్ల ఫోన్లు కెమెరా, మెమొరీ కార్డ్ సపోర్ట్, పెద్ద సౌండ్ వచ్చే స్పీకర్లు వంటి ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేవి. అప్పటి నుంచి చైనా మొబైల్స్‌కు క్రమంగా ఆదరణ పెరగడం మొదలైంది.
క్రమంగా ప్రజలు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వడం ప్రారంభించారు. ఈ మార్పుకు భారత బ్రాండ్లు వేగంగానే అడాప్ట్ అయ్యాయి. రూ.ఐదు వేలలోపు ధరలోనే లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలు బేసిక్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసేవి. అప్పుడు కూడా కూల్‌ప్యాడ్, లీటీవీ వంటి చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసేవి. మనదేశంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ కూల్‌ప్యాడ్ కంపెనీకి చెందినదే. కూల్‌ప్యాడ్ కూల్ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్. అంతకుముందు ఐఫోన్ 5ఎస్‌లో మాత్రమే ఈ ఫీచర్ ఉండేది.
షావోమీ రాకతో...
అయితే 2014లో షావోమీ రాకతో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ రూపురేఖలు మారిపోయాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తూ షావోమీ భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా ఎదిగింది. ముఖ్యంగా రెడ్‌మీ నోట్ సిరీస్‌లో ఉన్న ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికీ రెడ్‌మీ నోట్ సిరీస్‌లో వచ్చే ఫోన్ల కోసం వెయిట్ చేసే వారు ఉన్నారు.
ఒప్పో, వివో వంటి బ్రాండ్లు మంచి కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసి, కెమెరా ప్రియుల దృష్టిని ఆకట్టుకున్నాయి. వివోకు సబ్‌బ్రాండ్‌గా వచ్చిన రియల్‌మీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటి. వన్‌ప్లస్, ఐకూ వంటి బ్రాండ్లు ప్రీమియం సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కూడా ఈ ధరలో ఫోన్లు లాంచ్ చేస్తున్నప్పటికీ బడ్జెట్ ధరలో శాంసంగ్ ఫోన్లకు ఆదరణ తక్కువ.
ఇన్‌ఫీనిక్స్, టెక్నో, ఐటెల్ స్మార్ట్ ఫోన్లకు టైర్-2,3 నగరాల్లో మంచి ఆఫ్‌లైన్ సేల్ మార్కెట్ ఉంది. ఈ మూడు కంపెనీల ఫోన్లు దాదాపు రూ.15 వేలలోపే ఉంటాయి. ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లు రూ.15 వేల ధరలోపు ధరలోవే. వీటిలోనూ చైనా బ్రాండ్లే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రూ.12 వేలలోపు చైనీస్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేస్తే ఆ ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా పడనుంది.
భారత బ్రాండ్లకు అవకాశం ఉంటుందా?
ఒకప్పుడు లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి భారత స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేవి. అయితే షావోమీ, ఒప్పో, వివో వంటి కంపెనీల ఎంట్రీతో భారత బ్రాండ్లు వెనకబడ్డాయి. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లను అందించడంతో వినియోగదారులు చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో ఈ మూడు బ్రాండ్లూ మెల్లగా మార్కెట్ నుంచి తప్పుకున్నాయి. లావా అప్పుడప్పుడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూనే ఉన్నా వీటిలో ఏవీ వినియోగదారులను ఆకట్టుకోవడం లేదు. ఇక మైక్రోమ్యాక్స్ ఇటీవలే మళ్లీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించింది.
ఇప్పుడు భారత ప్రభుత్వం రూ.12 వేలలోపు చైనా స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లకు ఎంత మేలు జరుగుతుందో చూడాలి. ఎందుకంటే అంతిమంగా వినియోగదారుడు సంతృప్తి చెందితేనే ఏ కంపెనీ అయినా మార్కెట్లో సక్సెస్ అవుతుంది. చైనా బ్రాండ్ల తరహాలో తక్కువ బడ్జెట్‌లో టాప్ ఫీచర్లను భారత బ్రాండ్లు అందించగలవా అనేది తెలియాల్సి ఉంది. భారత కంపెనీలు జాగ్రత్త పడి వెంటనే ట్రాక్‌లోకి వస్తే పర్లేదు. లేకపోతే వినియోగదారులు మంచి మొబైల్ కావాలంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టక తప్పదు. భారత ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని భారత మొబైల్ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుని మంచి ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటాయా? లేకపోతే స్కోప్ ఉన్న మార్కెట్ కాబట్టి కొత్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు వస్తాయా అనేది చూడాలి. జియో కూడా ఇటీవలే జియోఫోన్ నెక్స్ట్ అనే చవకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. జియో దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ తయారీ ప్లాన్లు ఉన్నాయేమో మరి!