NPS Balance Check: వృత్తి జీవితం ముగిశాక ఆనందంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పింఛను పథకం (NPS) తీసుకొచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత నిలకడగా పింఛను పొందలేని వారికి రక్షణగా దీనిని ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చేరేందుకు అందరూ అర్హులే. ఏడాదికి కనీసం రూ.1000 కంట్రిబ్యూషన్‌ చేస్తే చాలు.


నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఖాతాలోని బ్యాలెన్స్‌ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఖాతాలో మీరెంత నగదు జమ చేశారన్నది మొదటిది. యాన్యుటీలో మీరు 40 శాతం మెచ్యూరిటీ మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. దాన్నుంచి వచ్చిన ఆదాయం రెండోది.


ఇంటికే స్టేట్‌మెంట్‌


సాధారణంగా ఎన్‌పీఎస్‌ ఖాతా లావాదేవీల స్టేట్‌మెంట్‌ను సంబంధిత సీఆర్‌ఏ ఏటా మీ నమోదిత అడ్రస్‌కు పంపిస్తారు. అలాగే నెలకో, మూడు నెలలకో మీ ఈమెయిల్ ఐడీకి సాఫ్ట్‌ కాపీ వస్తుంది. మరీ అవసరం అనుకుంటే ఆన్‌లైన్‌లోనూ ట్రాన్జాక్షన్‌ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే సీఆర్‌ఏ, ఎన్‌పీఎస్‌ మొబైల్‌ యాప్‌ వెబ్‌సైట్‌, ఉమాంగ్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.


ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ (NSDL)


* మొదట ఎన్‌ఎస్‌డీఎల్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయాలి.
* మీ ప్రాన్‌ (PRAN), యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ అవ్వాలి.
* ఆ తర్వాత క్యాప్చా ఎంటర్‌ చేయాలి.
* ఇప్పుడు 'ట్రాన్జాక్షన్‌ స్టేట్‌మెంట్‌' సెక్షన్‌లోని హోల్డింగ్‌ స్టేట్‌మెంట్‌ను క్లిక్ చేయాలి.
* దాంతో ఎన్‌పీఎస్‌ ఖాతా వివరాలు డిస్‌ప్లే అవుతాయి.


ఎన్‌పీఎస్‌ మొబైల్‌ యాప్‌ వెబ్‌సైట్‌ (NPS App)


నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనీ సీఆర్‌ఏ వెబ్‌సైట్‌లోని తాజా అకౌంట్‌ సమాచారం తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ప్రాన్‌ (పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌), వెల్‌కం కిట్‌తో వచ్చిన పిన్‌ను ఎంటర్‌ చేయాలి. లాగిన్‌ అయ్యాక అప్పటి వరకు ఉన్న బ్యాలెన్స్‌ చూసుకోవచ్చు. టైర్‌ 1, టైర్‌ 2 ఖాతాల్లోని వివరాలూ తెలుసుకోవచ్చు. చివరి ఐదు లావాదేవీలు సైతం కనిపిస్తాయి. ప్రొఫైల్‌ సమాచారం, రిజిస్టర్డు ఈ మెయిల్‌, మొబైల్‌ నంబర్‌నూ ఎడిట్‌ చేసుకోవచ్చు.


ఉమాంగ్‌ యాప్‌ (Umang)


కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా ఎన్‌పీఎస్‌ సేవలు అందుకోవచ్చు. ఇందుకోసం మొదట ఉమాంగ్‌ యాప్‌ను మీ మొబైల్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎన్‌పీఎస్‌ ఆప్షన్‌ ఎంచుకొని సంబంధిత సీఆర్‌ఏపై టాప్‌ చేయాలి. మీ ప్రాన్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే 'కరెంట్‌ హోల్డింగ్‌' అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి లాగినైతే చాలు. ఇందులో మీ స్కీమ్‌ వివరాలు, పెట్టుబడిపై వచ్చిన రాబడి, ఇతర సమాచారం తెలుసుకోవచ్చు.


ఎస్‌ఎంఎస్‌ (SMS)


మిస్డ్‌ కాల్‌తోనూ ఎన్‌పీఎస్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఇందుకు ఎన్‌పీఎస్‌లో నమోదు చేసిన మొబైల్‌ నుంచి 9212993399 నంబర్‌కు కాల్‌ చేయాలి. వెంటనే మీ ఖాతా వివరాలతో కూడిన సందేశం వస్తుంది. ఏమైనా సందేహాలు ఉంటే కస్టమర్‌ సర్వీస్‌ 022-24993499కు కాల్‌ చేయొచ్చు.