Gold Price: అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వరుసగా నాలుగో వారం పుత్తడి లాభాల్లోనే ముగియడం గమనార్హం. మానసిక స్థాయిగా భావించే 1800 డాలర్లకు ఔన్స్‌ ధర చేరువైంది. అక్టోబర్‌ గోల్డ్ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులు రూ.52,579 స్థాయిల్లో ఉన్నాయి. గత శుక్రవారం నాటి 51,864తో పోలిస్తే 1.37 శాతం పెరిగాయి.


అమెరికా ద్రవ్యోల్బణం కాస్త తగ్గడంతో డాలర్‌ విలువ తగ్గుముఖం పడుతుందని కమోడిటీ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డాలర్‌ సూచీ 5 వారాల కనిష్ఠానికి చేరుకోవడంతో బంగారం ధర 5 వారాల గరిష్ఠానికి చేరుకుందని గుర్తు చేస్తున్నారు. మున్ముందు మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


అతి త్వరలోనే ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు బంగారం ధర రూ.53,500 స్థాయికి చేరుకుంటుందని కమొడిటీ నిపుణులు చెబుతున్నారు. అందుకే ధర తగ్గినప్పుడల్లా ఈ విలువైన లోహంలో పెట్టుబడి పెట్టాలని వారు  సూచిస్తున్నారు. స్పాట్‌ బంగారం ధరలు ఔన్స్‌కు 1760 నుంచి 1820 డాలర్ల మధ్య చలిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన నిరోధం దాటితే 1820 డాలర్లు దాటడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.


'అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు మించే తగ్గడం ఈ వారం ప్రధానాంశం. యూఎస్‌ కన్జూమర్స్‌ ఇండెక్స్‌ 8.5 శాతానికి చేరుకుంది. జూన్‌లో నమోదైన 9.1 శాతం కన్నా ఇది తక్కువే. ఉత్పత్తిదారుల ద్రవ్యోల్బణం 9.8 శాతంగా ఉంది. సరఫరా గొలుసులో అంతరాలు తొలగిపోయి పరిస్థితులు మెరుగవ్వడమే ఇందుకు కారణం' అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ విశ్లేషకుడు సుగంధ సచ్‌దేవా అన్నారు. ప్రస్తుతానికి మార్కెట్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ధరలు తగ్గుతుండటంతో యూఎస్‌ ఫెడ్‌ సెప్టెంబర్లో వడ్డీరేట్లను 75బీపీఎస్‌తో పోలిస్తే 50 బేసిస్‌ పాయింట్లే పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.


సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయని ఐఐఎఫ్‌ఎల్‌ రీసెర్చ్‌ ఉపాధ్యక్షుడు అనుజ్‌ గుప్తా సైతం అంటున్నారు. 'గోల్డ్‌ ఔట్‌లుక్‌ మెరుగ్గా ఉంది. స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ ధర 1760-1820 డాలర్ల మధ్య కొనసాగితే ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం మంచి వ్యూహం. తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించొచ్చు. ఒకవేళ పుత్తడి 1820 డాలర్ల స్థాయిలో నిలదొక్కుకుంటే అట్నుంచి 1855, 1860 స్థాయిలకు చేరుకోవచ్చు' అని ఆయన అంచనా వేశారు. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 52,000 స్థాయిలో నిలబడితే రూ.53,000కు చేరుకోవచ్చని అన్నారు.


ప్రస్తుత స్థాయిల్ని నిలదొక్కుకోకుంటే మాత్రం 10 గ్రాముల బంగారం రూ.51,400-51,200కు దిగొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ ఆ స్థాయిలో కొనుగోలు చేస్తే రూ.53,500 వద్ద విక్రయించేందుకు అవకాశం దొరకుతుందని వెల్లడించారు.