ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగం రోజు రోజు భారీగా పెరిగిపోతోంది. వాట్సాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. చాలా మంది ముఖ్యమైన పనులను వాట్సాప్ ద్వారానే చక్కబెట్టుకుంటున్నారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉన్నది. వీటి సాయంతో వినియోగదారులు మరింత మెరుగ్గా వాట్సాప్ సేవలను వినియోగించుకుంటున్నారు. తాజాగా వాట్సాప్ మరో చక్కటి ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. అదే వాట్సాప్ కాలింగ్ షార్ట్ కట్స్.


ఇకపై ఈజీగా వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు!


ఈ లేటెస్ట్ ఫీచర్ తో వినియోగదారులు కాలింగ్ షార్ట్‌ కట్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం కాంటాక్ట్స్‌ జాబితాలోని పేరుపై ప్రెస్ చేయడం ద్వారా ఈజీగా కాల్ వెళ్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్, త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ అప్‌ డేట్ చేసుకున్న వెంటనే యాప్‌కి కొత్త కాలింగ్ షార్ట్‌ కట్ వస్తుంది.  ఒకే వ్యక్తికి కాల్ చేసిన ప్రతిసారి పేరు సెర్చ్ చేయకుండా ఈ ఫీచర్ ద్వారా షార్ట్ కట్‌ను పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులకు టైమ్ సేవ్ కావడంతో పాటు కాంటాక్ట్స్ ను వెతికే శ్రమ తగ్గనుంది   






అందుబాటులోకి సరికొత్త వాట్సాప్ ఫీచర్లు


వాట్సాప్ నుంచి పలు ఫీచర్లు అందుబాటులోకి రావడంతో పాటు మరికొన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా మెసేజ్ యువర్ సెల్ఫ్‌ అనే అప్ డేట్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా తమకు తాముగా మెసేజెస్ పంపుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వివరాలను తమకు తాముకు పంపుకోవచ్చు. మరోవైపు వాయిస్ నోట్ ను స్టేటస్ గా పెట్టుకునే అవకాశం కల్పించింది. డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ రాసుకునే వెసులుబాటును వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు నాణ్యమైన క్వాలిటీలో ఫోటోలను పంపుకునే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సాప్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపుకునే ఫోటోల్లో క్వాలిటీ తగ్గిపోతుంది. తాజాగా ఫీచర్ ద్వారా  ఫోటో క్వాలిటీ దెబ్బ తినకుండా పంపుకునే వెసులుబాటు కలగనుంది. అటు త్వరలో టెక్ట్స్ ఎడిటర్ టూల్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఉన్న డ్రాయింగ్ టూల్‌కు కొత్త టెక్స్ట్ ఎడిటర్‌ ను యాడ్ చేయనుంది. వినియోగదారులు టెక్స్ట్ పంపే ముందు కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నచ్చిన ఫాంట్స్ ​​టెక్స్ట్ అలైన్‌ మెంట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బ్యాక్‌ గ్రౌండ్ ను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తంగా ఎప్పటికప్పడు నూతన ఫీచర్లతో వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.


Read Also: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!