వాట్సాప్ ఉపయోగించేవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఫోన్లు మార్చినప్పుడు డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు, ఐవోఎస్ నుంచి ఐవోఎస్‌కు మార్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ, ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు, ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు మార్చేటప్పుడు చాట్ బ్యాకప్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాట్సాప్ దానికి కూడా ఒక పరిష్కారం తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.


ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ‘వాట్సాప్ చాట్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్‌ఫర్‌కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిఫ్షన్ ఉంటుంది. ఇది ఎక్కువమంది కోరుకున్న ఫీచర్.’ అని మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.


ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ 10 నెలల క్రితమే ప్రకటించింది. అయితే వినియోగంలోకి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. దీనికి వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిట్లోనూ లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ అవ్వాల్సి ఉంటుంది.


ఆండ్రాయిడ్ 5 లేదా ఆపైన, ఐవోఎస్ 15.5 లేదా ఆ పైన ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే స్మార్ట్ ఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్‌లో వాట్సాప్ డేటాను పొందడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏ సిమ్‌ను ఉపయోగించారో అదే సిమ్‌ను వేసుకోవాలి.


అయితే మీరు ఐవోఎస్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఆ ఫోన్ పూర్తిగా కొత్తది అయి ఉండాలి. లేకపోతే ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు ఆ ఫోన్‌ను రీసెట్ చేయాల్సి ఉంటుంది.


ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఐఫోన్‌కు వాట్సాప్ డేటాలను మార్చడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:


1. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘Move to iOS App’ ఇన్‌స్టాల్ చేయాలి.
2. ఆ తర్వాత అందులో చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.
3. ఇప్పుడు మీ ఐఫోన్‌లో ఒక కోడ్ డిస్‌ప్లే అవుతుంది.
4. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
5. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.
6. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ డేటా స్క్రీన్‌లో వాట్సాప్‌ను ఎంచుకోవాలి.
7. ఆ తర్వాత ‘Move to iOS’ యాప్‌లో నెక్స్ట్‌పై క్లిక్ చేయాలి.
8. ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ మొదలవడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.
9. డేటా మొత్తం ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక ‘Move to iOS’ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది.
10. ఇదంతా పూర్తయ్యాక మీ ఐఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
11. మీ పాత డివైస్‌లో ఏ నంబర్‌లో వాట్సాప్ ఉపయోగించారో అదే నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
12. అక్కడ మీరు మొదలుపెట్టిన డేటా ట్రాన్స్‌ఫర్‌ను కంప్లీట్ చేయవచ్చు.


మీకు వాట్సాప్ బ్యాకప్ వచ్చిందంటే మీ చాట్ గూగుల్ డ్రైవ్ నుంచి ఐక్లౌడ్ స్టోరేజ్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు కాదు. ఒకసారి మీకు డేటా ట్రాన్స్‌ఫర్ కంప్లీట్ అయ్యాక మీరు దాన్ని మాన్యువల్‌గా బ్యాకప్ చేసుకోవాలి. మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ డేటా అలానే ఉంటుంది. ఆ డేటా పోవాలంటే మీరు యాప్ డిలీట్ చేయాలి. లేదా ఫోన్ డేటాను మొత్తం వైప్ అవుట్ చేయాలి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!