ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులకు మరింత ఈజీ చాటింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది. తాజాగా మెటా యాజమాన్యం వాట్సాప్ కు సంబంధించి సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతోంది. గ్రూప్ చాట్స్ విషయంలో ఎలాంటి వివాదాలకు చోటులేకుండా పరస్పరం అభిప్రాయాలను పంచుకునేలా కొత్త ఫీచర్ ను విడుదలచేయనుంది.‘సెండ్ ఫర్ అడ్మిన్ రివ్యూ’ అనే ఫీచర్ ను ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో అభ్యంతరకరమైన మెసేజ్ లకు సంబంధించి గ్రూప్ మెంబర్స్ అడ్మిన్ కు రివ్యు కోసం పంపే అవకాశం ఉంటుంది.
అభ్యంతరకర మెసేజ్ లపై అడ్మిన్ నిర్ణయం
అంతేకాదు, కొత్త వాట్సాప్ ఫీచర్ ద్వారా గ్రూపులో షేర్ చేసిన మెసేజ్ పట్ల గ్రూపు సభ్యులకు ఎవైనా అభ్యంతరాలు ఉన్నా, అడ్మిన్ కు రిపోర్టు చేసే అవకాశం ఈ కొత్త ఫీచర్ లో అందుబాటులో ఉంటుంది. అలా రిపోర్టు చేసిన మెసేజ్ లు అడ్మిన్ కు గ్రూప్ ఇన్ఫో స్క్రీన్‌లో కనిపించబోయే న్యూ సెక్షన్ లో జమ అవుతాతయి. తనకు వచ్చిన రిపోర్టులను గ్రూప్ అడ్మిన్ ఎప్పటికప్పుడు పరిశీలించి తగు నిర్ణయాన్ని తీసుకుంటారు. సదరు మెసేజ్ లను తొలగించడం లేదంటే కొనసాగించడం, మెసేజ్ చేసిన వ్యక్తికి వార్నింగ్ ఇవ్వడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం అడ్మిన్ కు ఉంటుంది.
వివాదాస్పద చర్చలకు చెక్!
వాట్సాప్ గ్రూపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఈ ఫీచర్ తో కలుగబోతోందని వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. వాట్సాప్ గ్రూప్ మేనేజ్ చేసే విషయంలో గ్రూప్ అడ్మిన్ తో పాటు గ్రూప్ మెంబర్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ అడ్మిన్ రివ్యూ ఎంతో చక్కగా ఉంటుందని తెలిపింది. గ్రూప్ అడ్మిన్స్ బిజీగా ఉన్న సమసయంలో ఇతర సభ్యులు పంపే రిపోర్టు మెసేజ్ లను చూసి అలర్ట్ అయ్యేలా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
కొత్త ఫీచర్ వివరాలను వెల్లడించిన వాట్సాప్ బీటా ఇన్ఫో
తాజాగా ఈ ఫీచర్ కు సంబంధించిన వివరాలను వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ మేరకు ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. దీనిని పరిశీలిస్తే, గ్రూప్ సెట్టింగ్స్ స్క్రీన్‌లో కొత్తగా ‘సెండ్ ఫర్ అడ్మిన్ రివ్యూ’ అనే ఆప్షన్ కనిపిస్తోంది. ఈ ఆప్షన్ ను అడ్మిన్ ఎనేబుల్ చేసిన తర్వాత గ్రూప్ చాట్‌లోని మెసేజ్ లకు సంబంధించిన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా అడ్మిన్ కు నివేదించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా గ్రూపులో చక్కటి వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ Android 2.23.16.18 అప్ డేట్ పొందే అవకాశం ఉంటుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial