ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కానీ టెలిగ్రాం లాంటి ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పోటీ తట్టుకోవడానికి వాట్సాప్ ఇటీవలి కాలంలో దూకుడు పెంచింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి యాప్ లుక్‌నే మార్చేసే ఫీచర్‌తో వస్తుంది. అదే ఛాట్ ఫిల్టర్ ఫీచర్.
Wabetainfo కథనం ప్రకారం... వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.14.17లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఛాట్లను కేటగిరీల వారీగా సపరేట్ చేసుకోవచ్చు. బిజినెస్, పర్సనల్, అన్‌రీడ్ అనే మూడు ఫిల్టర్లు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఈ ఫిల్టర్లను మనం క్రియేట్ చేసుకోవచ్చా... లేకపోతే డీఫాల్ట్‌గా అందులో ఉన్నవే ఉపయోగించుకోవాలా అనేది మాత్రం తెలియరాలేదు. ఈ వెర్షన్ భవిష్యత్తు అప్‌డేట్లలో వాట్సాప్ కొత్త ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దీని కారణంగా మన ప్రయారిటీ ప్రకారం ఛాట్లను యాక్సెస్ చేయవచ్చు. దీనికి తోడు వాట్సాప్ స్టిక్కర్ సజెషన్ అనే ఫీచర్‌పై కూడా పని చేస్తుంది. అంటే ఏదైనా ఛాట్‌కు మీరు ఎమోజీతో రిప్లై ఇవ్వాలని ఆ ఎమోజీ టైప్ చేస్తే దానికి సంబంధించిన స్టిక్కర్ కింద డిస్‌ప్లే అవుతుందన్న మాట.
2018లో వాట్సాప్ మొదటిసారిగా స్టిక్కర్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లతో కమ్యూనికేట్ చేయడాన్ని ఇది మరింత మెరుగు పరిచింది. దీంతోపాటు స్టిక్కర్ ప్యాక్‌లు క్రియేట్ చేసుకోవడం, థర్డ్ పార్టీ యాప్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
ఎమోజీలకు అసోసియేట్ అయ్యేలా స్టిక్కర్ సజెషన్లు కూడా కావాలని యూజర్లు ఎప్పట్నుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను వాట్సాప్ బీటా టెస్టింగ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాల్సి ఉంది.