ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. అంటే ఈ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించడం కుదరదన్న మాట. అక్టోబర్ 24వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఐవోఎస్ 12 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్లకే వాట్సాప్ పనిచేయనుంది. అంటే ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుందన్న మాట.


ఈ విషయాన్ని WABetaInfo వెబ్ సైట్ కథనంలో తెలిపారు. అయితే ఈ ప్రభావం ఎక్కువ మందిపై పడే అవకాశం లేదు. ఐఫోన్లు ఉపయోగించే వారిలో 89 శాతం మంది ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ అయిపోయారు. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఐవోఎస్ 13 లేదా అంతకు ముందు వెర్షన్లు ఉపయోగిస్తున్నారు.


వాట్సాప్ తన వినియోగదారుల కోసం మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులకు మరింత ప్రైవసీ లభించనుంది. వాట్సాప్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ మూడు ఫీచర్లను షేర్ చేసింది. మెటా సీఈవో, ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ ఫీచర్లను షేర్ చేయడం విశేషం.


గ్రూప్ మెంబర్స్‌కు తెలియకుండా ఎగ్జిట్ అయిపోవచ్చు
వీటిలో మొదటిది గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవ్వడం గురించి. సాధారణంగా మనం ఏవైనా గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయితే వెంటనే గ్రూపు ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీరు గ్రూపు నుంచి ఎగ్జిట్ అయిన విషయం ఎవరికీ తెలియదు. కేవలం గ్రూప్ అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది.


ఆన్‌లైన్ స్టేటస్ కూడా హైడ్ చేయచ్చు
మనం వాట్సాప్‌లో లాస్ట్ సీన్ ఆఫ్ చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంటే ఆ విషయం అవతలివారికి తెలుస్తుంది. కానీ వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే మనం ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరికీ తెలియకుండా ప్రైవసీ ఫీచర్స్ మార్చుకోవచ్చు. అందులోనూ మనం కొందరికి మాత్రమే కనిపించేలా కూడా సెట్ చేసుకోవచ్చు.


ఫొటోలు స్క్రీన్ షాట్ తీయలేం
సాధారణంగా ప్రస్తుతం వాట్సాప్‌లో ఫొటోలు పంపితే అవి ఫోన్‌లో స్టోర్ అవుతాయి. వాట్సాప్ కొత్తగా ‘View Once’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఫొటో ఒక్కసారి చూడటానికి మాత్రమే వీలు అవుతుంది. అయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. కానీ వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తే వ్యూ వన్స్ ద్వారా పంపిన ఫొటోను స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా అవ్వదు.


ఈ మూడు ఫీచర్లు వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో కోరుకుంటున్నవే. వీటి ద్వారా వాట్సాప్‌లో ప్రైవసీ మరింత పెరగనుంది. వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే మెసేజ్‌లను అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే అడ్మిన్ ఏదైనా మెసేజ్‌ను గ్రూప్‌లో నుంచి డిలీట్ చేస్తే ఆ మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసినట్లు అక్కడ కనిపిస్తుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!