ప్రముఖ ఇన్ స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇకపై హై క్వాలిటీలో ఫోటోలు, వీడియోలను పంపుకునే వెసులుబాటు కల్పించబోతుంది. వాస్తవానికి ఇప్పటి వరకు వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలను స్టాండర్డ్ క్వాలిటీలో పంపించుకునే అవకాశం లేదు. దీని వల్ల యూజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హై క్వాలిటీలో వీడియోలు, ఫోటోలు పంపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది వాట్సాప్. జూన్ మొదటి వారం నుంచి టెస్ట్ రన్ నిర్వహిస్తున్నది. త్వరలో అందిరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

  


ఇకపై హై క్వాలిటీ వీడియోలు పంపుకోవచ్చు!


వాట్సాప్  బీటా ఇన్ఫో తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. హై క్వాలిటీ వీడియోలు, ఫోటోలు పంపుకునేందుకు గాను, వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్‌లో ఓ కొత్త బటన్‌ను జోడించినట్లు తెలిపింది. ఈ బటన్ తో వినియోగదారులు హై క్వాలిటీ వీడియోలను వాట్సాప్ ద్వారా నేరుగా పంపించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, వీడియోను ఉన్నది ఉన్నట్లుగా సెండ్ చేసుకోవచ్చు. వీడియోల మాదిరిగానే ఫోటోలను కూడా యూజర్లు ఒరిజినల్ క్వాలిటీలో పంపుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్‌లో బటన్ తో ఫోటోలను పంపించినప్పుడు మెసేజ్ బబుల్‌లో HD అనే  ట్యాగ్‌ కనిపిస్తుంది. దీని ద్వారా అది హై క్వాలిటీ ఫొటోగా గుర్తించే అవకాశం ఉంటుంది.  ఈ ట్యాగ్ వీడియోల మెసేజ్ బబుల్‌లో కూడా కనిపిస్తున్నట్లు తాజా ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా టెస్టర్లు గుర్తించారు.   


హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలను పంపేందుకు చేయాల్సిన సెట్టింగ్స్


కొత్త ఫీచర్ తో వీడియోలను పంపిస్తే 99 శాతం క్వాలిటీతో వెళ్తున్నాయి.  కొత్త ఫీచర్‌తో వీడియోల క్వాలిటీ ఇప్పటితో పోలిస్తే చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా ఈ బటన్ అందుబాటులోకి వచ్చినా వీడియోల షేరింగ్ విషయంలో డిఫాల్ట్ సెట్టింగ్ స్టాండర్డ్ క్వాలిటీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు  హై క్వాలిటీ వీడియోలను షేర్ చేయాలి అనుకున్న ప్రతిసారి  HD క్వాలిటీ ఆప్షన్‌ను మాన్యువల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ తమకు అందుబాటులోకి వచ్చిందో? లేదో? తెలుసుకోవడానికి వినియోగదారులు పెద్ద సైజు వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న వీడియోలకు హై క్వాలిటీ ఆప్షన్ కనిపించే అవకాశాలం లేనట్లు తెలుస్తోంది.


ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?


హై-క్వాలిటీ ఫీచర్ సాయంతో వీడియోలను పంపించుకునే అవకాశం ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన టెస్టర్లు మాత్రమే ఈ సేవను అందుకుంటున్నారు. వాట్సాప్ బీటా అప్‌డేట్‌ 2.23.14.10లో హై క్వాలిటీ వీడియోలను పంపించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని టెస్ట్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.  మరికొద్ది వారాల్లో ఇది క్రమంగా అందరు వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.   


Read Also: వాట్సాప్‌లో కూడా మెసేజ్ ఎడిట్ - ఎలా చేయాలో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial