వాట్సాప్ తన నెలవారీ నివేదికను విడుదల చేసింది. మే నెలలో 19 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఈ నివేదికలో ప్రకటించింది. ఇదే సమయంలో బ్యాన్ ఎత్తివేయాలని అప్పీల్ చేస్తూ 303 రిపోర్ట్స్ రాగా... వాటిలో 23 రిపోర్ట్స్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపింది. దీంతోపాటు 149 అకౌంట్ యాక్షన్ రిపోర్ట్స్, 34 ప్రొడక్ట్ సేఫ్టీ రిపోర్ట్స్ రాగా... వాటిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పేర్కొంది.


అంటే మేలో మొత్తంగా 528 రిక్వెస్టులు రాగా... వాటిలో 23 రిపోర్ట్‌లపై మాత్రమే వాట్సాప్ స్పందించింది. అదే సమయంలో 19.1 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఐదు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ప్రతి నెలా కంప్లయన్స్ రిపోర్ట్ విడుదల చేయాలి.


ఏప్రిల్‌లో వాట్సాప్ 16.66 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. ఇదే సమయంలో మొత్తం 670 బ్యాన్ అప్పీల్స్ రాగా... 122 రిపోర్ట్స్‌పై స్పందించింది. అలాగే మార్చిలో 18.05 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. అలాగే వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానుంది.


వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ‘ఆన్‌లైన్’ ఆప్షన్‌ను హైడ్ చేసే ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని WABetainfo అనే వెబ్‌సైట్ తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా WABetainfo షేర్ చేసింది.


ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... మీరు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం మీ చాట్‌లోకి వచ్చినా అవతలివారికి తెలియదు. ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.


వాట్సాప్ వినియోగదారులు ఈ ఫీచర్ కోసం ఎప్పట్నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. తాము ఆన్‌లైన్‌లో ఉన్న సంగతి ఇతరులకు తెలియడం తమ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. వాళ్లకి ఇది కచ్చితంగా గుడ్ న్యూస్. అయితే అందరికీ కాకుండా ఎంపిక చేసిన కాంటాక్ట్స్‌కు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్న సంగతి తెలియకుండా చేయవచ్చు. దాన్ని స్క్రీన్ షాట్లలో కూడా చూడవచ్చు. చూడగానే ఈ ఫీచర్ కావాలనిపిస్తుంది కదా! కానీ కావాలంటే మాత్రం ఇంకొంచెం టైం పడుతుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!