దక్షిణాదిలో పట్టు కోసం ప్రయత్నాలు 


దేశవ్యాప్తంగా ఇప్పుడు భాజపా ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ వేవ్‌లో దాదాపు రెండు సార్లు కేంద్రంలో విజయం సాధించింది కాషాయ పార్టీ. ఒకప్పుడు నామమాత్రపు సీట్లతో ఉందంటే ఉంది అని అనిపించుకున్న ఈ పార్టీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన క్యాడర్‌ను సంపాదించుకుంది. 2014 తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతూ వస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాస్త బలపడింది. కానీ బీజేపీకి సౌత్ ఫోబియా మాత్రం పోవటం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టి పట్టు సాధించిన భాజపా, దక్షిణాదికి వచ్చే సరికి డీలా పడిపోయింది. ఇందుకు కారణం..దక్షిణాది రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు బలంగా ఉండటం. అంతే కాదు. భాజపా అంటే జాతీయ పార్టీ, ఆ క్యాడర్ అంతా దిల్లీలోనేఉంటుంది. రాష్ట్రాల్లోని సమస్యలు ఆ పార్టీకి ఏమర్థమవుతాయ్ అనే భావన దక్షిణాదిలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా చాన్నాళ్ల పాటు ఇక్కడి ప్రజలు భాజపాను పెద్దగా ఆదరించలేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్టు కనిపిస్తోంది. మోదీ, షా ద్వయం తమదైన వ్యూహాలతో ఇక్కడా పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నారు. 


మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ రెడీ


1980లో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి దక్షిణాదిలో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది భాజపా. మోదీ,షా ద్వయం వ్యూహరచన చేసినప్పటికీ కేవలం కర్ణాటకలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో అధికారం ఇంకా కలగానే ఉండిపోయింది. అందుకే ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. 2023లో కర్ణాటక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2026లో కేరళ, తమిళనాడులో ఎలక్షన్స్‌ జరుగుతాయి. అయితే భాజపా జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షా పని చేసిన రోజుల్లోనే "మిషన్ సౌత్ ఇండియా" ప్లాన్ రెడీ చేశారట. ఇప్పుడీ ప్లాన్‌ని అమలు చేసే బాధ్యత ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జేపీ నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ మిషన్‌ను ముందుండి నడిపించనున్నారు. 


తెలంగాణపైనే గురి పెట్టిన భాజపా


కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుతో దక్షిణాదిపై భాజపా ఆశలు బలపడ్డాయి. ఆ తరవాత అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించింది. రెండు ఉప ఎన్నికల్లో గెలవటం సహా జీహెచ్‌ఎంసీలో పలు చోట్ల విజయం సాధించటం, ఆ పార్టీలో విశ్వాసాన్ని పెంచింది. ఆ రెండు ఉప ఎన్నికల్లోనూ
అభ్యర్థికున్న ఫాలోయింగ్ వల్లే గెలుపు సాధ్యపడిందన్న వాదన వినిపిస్తున్నా, తెలంగాణ ప్రజలు తమను నమ్ముతున్నారనటానికి ఇదే సాక్ష్యమంటూ ప్రచారం చేసుకుంటోంది కాషాయ పార్టీ. ఇక జేపీ నడ్డా సహా అమిత్‌షా కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణలో పర్యటించారు. ప్రధాని మోదీ కూడా ఈ ఏడాది మే లో హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో చేసిన ప్రసంగంలో కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయాల్లో నెపోటిజం కారణంగా యువత నష్టపోతోందనీ పదేపదే ప్రస్తావించారు. ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కేవలం ఓ కుటుంబానికే పరిమితం కాకూడదంటూ మండిపడ్డారు. ఇలా తరచు పర్యటనలు చేస్తూ, తెరాసకు ప్రత్యామ్నాయం తామే అనే భావన బలపడేలా  చేస్తోంది భాజపా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, ఎన్నికల ఫైట్ మాత్రం తెరాస వర్సెస్ భాజపాగా మారనుందన్న సంకేతాలు క్లియర్‌గానే కనిపిస్తున్నాయి. 


ఈ 5 రాష్ట్రాల్లోనూ పాచికలు పారతాయా..? 


తమిళనాడులోనూ ఈ మధ్య కాలంలో బాగానే పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. అయితే తమిళనాడులో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భాజపా నెగ్గుకురావటం అంత సులభం కాదు. అక్కడ ద్రవిడ పార్టీలదే హవా. హిందీ విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఇప్పటికే ఆ రాష్ట్రంలో అలజడి సృష్టించాయి. బలవంతంగా తమపై హిందీ రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని తమిళులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో పార్టీకి డ్యామేజ్ తప్పేలా లేదు. ఇక తరవాతి టార్గెట్ కేరళ. ఇక్కడ వాయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు రాహుల్ గాంధీ. కేరళలో కాస్తో కూస్తో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉంది. లెఫ్ట్‌ పార్టీలు కాకుండా ఇక్కడ వేరే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. అంతగా బలపడిపోయాయి  వామ పక్షాలు. అయితే ఈ సారి ఇక్కడ కూడా గెలవాలని భావిస్తోంది కాషాయ పార్టీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 129 ఎంపీ సీట్లున్నాయి. 2024లో భాజపా ఇక్కడ కూడా గెలవాలంటే వీరందిరినీ అధిగమించక తప్పదు. అందుకే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది అధిష్ఠానం. భాజపా పాచికలు దక్షిణాదిలో పారతాయో లేదో చూడాలి మరి.