ఈ మధ్య కాలంలో మనందరం ఎక్కువగా వింటోంది క్రిప్టో కరెన్సీ గురించే. ఇన్వెస్టర్లలోనూ, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసిన క్రిప్టో కరెన్సీ గురించే డిస్కషన్ అంతా. ఆర్‌బీఐ దీనిపై నిషేధం విధించడంతో ఇన్వెస్ట్ చేసినవాళ్లు కూడా భయపడుతున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా క్రిప్టోలో రూ.70 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ట్రేడింగ్ అయినా జరుగుతోంది? ఫ్యూచర్‌లో దానికి అయినా అనుమతి ఉంటుందా? ట్రేడింగ్‌ను కూడా నిషేధిస్తారా? ఒకవేళ నిషేధిస్తే ఇన్వెస్ట్ చేసిన డబ్బుల పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు, రకరకాల డౌట్లు.. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దీనికి చట్టబద్ధత ఉందా?


క్రిప్టోకరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. దీని లావాదేవీలకు సంబంధించిన రికార్డులను క్రిప్టోగ్రఫీ అనే డీసెంట్రలైజ్డ్ సిస్టం ద్వారా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ‘లెడ్జర్’ అనే డేటాబేస్‌లో ఈ లావాదేవీల రికార్డులను స్టోర్ చేస్తారు. మనం క్రిప్టో కరెన్సీ ద్వారా చేసే ప్రతి లావాదేవీ ఈ లెడ్జర్‌లో స్టోర్ అవుతుంది. ఇవి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి.


1980ల నుంచే క్రిప్టోకరెన్సీ గురించి వార్తలు అక్కడక్కడ వినిపించాయి. అయితే ప్రపంచంలో మొట్టమొదటి డీసెంట్రలైజ్డ్ క్రిప్టోకరెన్సీ మాత్రం బిట్ కాయినే. 2009లో మార్కెట్లోకి వచ్చిన బిట్ కాయిన్ ఊహించని విధంగా విపరీతమైన సక్సెస్ కావడంతో.. మరిన్ని క్రిప్టోకరెన్సీలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ సంవత్సరం జూన్‌లో ఎల్ సాల్వడార్ అనే దేశం మొట్టమొదటిసారి బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా యాక్సెప్ట్ చేస్తూ బిల్ పాస్ చేసింది. ఆ తర్వాత క్యూబా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.


అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో చైనా క్రిప్టోకరెన్సీపై పూర్తి నిషేధం విధించింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలతో పాటు మైనింగ్‌ను కూడా పూర్తిగా నిషేధించింది. అంటే చైనాలో క్రిప్టో మైనింగ్ చేసినా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే అన్నమాట. ఇక మనదేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం దీనిపై నిషేధం లేదా కఠినమైన ఆంక్షలు విధించడం మాత్రం త్వరలోనే జరుగుతుందనుకోవచ్చు.


కొన్ని దేశాలు క్రిప్టోకు లీగల్ టెండెన్సీ ఇస్తున్నాయి కదా.. ఇంకెందుకు భయం అని ఇందులో ఇన్వెస్ట్ చేసేవారు అనుకోవచ్చు. అయితే లీగల్ టెండెన్సీతో పాటు పూర్తిగా బ్యాన్ కూడా చేసిన దేశాలు ఉన్నాయి. దీంతోపాటు క్రిప్టోకరెన్సీ ట్రాక్ చేయడం చాలా కష్టం. చాలా వరకు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్లకు క్రిప్టోకరెన్సీనే వాడుతున్నారు.


ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రూపాయి భారతదేశ కరెన్సీ, డాలర్ అమెరికా కరెన్సీ. మరి బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు వేటికి సంబంధించిన కరెన్సీ? సరిగ్గా చెప్పాలంటే బిట్‌కాయిన్ ఎవరు రూపొందించారో కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. బిట్‌కాయిన్‌ను పేమెంట్‌గా స్వీకరిస్తామని ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ప్రకటించింది. అప్పుడు బిట్ కాయిన్ విలువ ఆల్‌టైం రికార్డుకు చేరుకుంది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


‘రూపాయిని పేమెంట్‌గా తీసుకోబోం’ అని మనదేశంలో లావాదేవీలు నిర్వహించే ఏ కంపెనీ కూడా తెలిపే అవకాశం లేదు. కానీ ఇటువంటి కరెన్సీలకు అలా కాదు. వీటిని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు. వీటికి స్థిరత్వం అనేది ఉండదు.


క్రిప్టోకరెన్సీపై మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే స్క్విడ్ గేమ్ అనే కొరియన్ వెబ్ సిరీస్ విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ పేరు మీద స్క్విడ్ అనే కాయిన్‌ను చెలామణీలోకి తీసుకువచ్చారు. అయితే చెలామణీకి వచ్చిన కాసేపటికే దీని విలువ 2,800 డాలర్లకు(మనదేశ కరెన్సీలో రూ.2 లక్షలకు పైనే) చేరుకుంది. అయితే ఐదు నిమిషాల్లోనే దీని విలువ తిరిగి సున్నాకు చేరుకుంది. అంటే కాయిన్ సృష్టించిన వ్యక్తి ఈ డబ్బులు తీసుకుని బోర్డు తిప్పేశాడన్న మాట. ప్రస్తుతం చెలామణీలో ఉన్న క్రిప్టోకరెన్సీలో 90 శాతం త్వరలో మాయం కానున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా గతంలో ఒకసారి తెలిపారు.


దీంతోపాటు క్రిప్టోకరెన్సీ చెల్లుబాటు ఎక్కువ అయితే అది ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నాయి. ఇక మనదేశంలో క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేస్తారా? వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. క్రిప్టో కరెన్సీ మీద రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా మనదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ కొత్తగా క్రిప్టో ట్రేడింగ్ మొదలు పెట్టాలనుకునే వారు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునేదాకా కొంచెం ఎదురు చూస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటే మంచిది.


Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి