ప్రస్తుతం మోబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే గుర్తుకు వచ్చేది ఆండ్రాయిస్, ఐవోఎస్. ఈ రెండు ఓఎస్ లు అద్భుతమైన ఫీచర్లు, అత్యంత ఈజీగా ఉపయోగించుకునేలా రూపొందించాయి. ఈనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు వీటినే వాడుతున్నారు. గత కొంత కాలంగా వీటికి పోటీగా మరికొన్ని ఓఎస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. మరింత వేగం, అద్భుతమైన ఫీచర్లు, సెక్యూరిటీ విషయంలో రాజీ లేకపోవడం లాంటి  విషయాలతో ఆండ్రాయిడ్, ఐవోఎస్ కు సవాలు విసురుతున్నాయి. తాజాగా భారత్ నుంచి సరికొత్త ఓఎస్ ఆవిష్కరణ జరిగింది. 'భారోస్'(BharOS) పేరుతో ఈ ఓఎస్ రూపొందింది.






'భారోస్'ను ఎవరు డెవలప్ చేశారంటే?


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ మద్రాస్ ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. దీనికి 'భారోస్'(BharOS) అని నామకరణం చేసింది. గోప్యత, భద్రత ప్రధాన లక్ష్యాలుగా ఈ ఓఎస్ రూపొందింది. ఐఐటీ మద్రాస్, ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, జాండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ఓఎస్ ను అభివృద్ధి చేశాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ తో పోల్చితే మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు టెక్ నిపుణులు. ఈ ఓఎస్ ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్స్ ను అనుమతించదు. వైరస్, మాల్వేర్, హ్యాకింగ్ కు అవకాశం లేకుండా రూపొందించబడింది. దేశంలో 100 కోట్ల మంది మోబైల్ వినియోగదారులు దీనిని వినియోగించుకునేలా తయారు చేశారు. అత్యంత రహస్యమైన విషయాలు, సున్నితమైన సమాచారాన్ని మరింత గోప్యంగా, భద్రంగా ఉంచుకోవాలనుకునే  సంస్థలు ఈ ఓఎస్ ను వినియోగిస్తున్నాయి. ప్రైవేట్ 5G నెట్‌ వర్క్‌ ద్వారా దీన్ని వాడుతున్నాయి.  


డేటాకు కచ్చితమైన భద్రత


'భారోస్' భద్రత విషయంలో చాలా కచ్చితత్వంతో ఉంటుంది. ఈ ఓఎస్ కలిగిన మోబైల్స్ లో థర్డ్ పార్టీ యాప్స్ కు అనుమతి ఉండదు.  కొన్ని నియంత్రిత యాప్‌లను మాత్రమే అనుమతిస్తుంది. ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ అసలే ఉండవు. దీని వల్ల యాప్ పర్మిషన్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.


ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్లలో ‘BharOS’ను ఇన్‌స్టాల్‌ చెయ్యొచ్చా?


ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఓఎస్ వినియోగం ఉన్న ఫోన్లలో ‘భారోస్‌’ను ఇన్ స్టాల్ చేసే అవకాశం లేదు. గూగుల్ ఆయా మోబైల్ తయారీ కంపెనీలతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం కారణంగా ఆండ్రాయిడ్ నే వాడాల్సి ఉంటుంది. ఇండియాలోని మొబైల్ యూజర్లను అట్రాక్ట్‌ చేయాలంటే ‘భారోస్’ కూడా ఆయా కంపెనీలతో జతకట్టాల్సి ఉంటుంది. మోబైల్ ఫోన్లలో ‘భారోస్‌’ వినియోగాన్ని పొందేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ ఇండస్ట్రీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని JandKops సంస్థ భావిస్తోంది.  


Read Also: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?