ప్రస్తుతం ఏం పని చేయాలన్నా టెక్నాలజీని అందుకు జత చేస్తున్నాం. ఈ క్రమంలో మనకు తెలియకుండానే ఎన్నో పాస్‌వర్డ్స్, పిన్‌లు ఆన్‌లైన్ ద్వారా చోరీకి గురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో మన వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. దాంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తరచుగా ఆన్‌లైన్ మోసాలకు గురవుతుంటారు. ఈ క్రమంలో వచ్చిన మరో కొత్త మోసం విషింగ్. ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. వాటి పూర్తి వివరాలు మీకోసం..
ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, సున్నితమైన కొన్ని విషయాలను రాబట్టే నేర ప్రక్రియను విషింగ్ అంటారు. మీ యూజర్ ఐడీలు, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్, ఓటీపీ, యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ (యూఆర్ఎన్), కార్డుల పిన్ నెంబర్స్, గ్రిడ్ కార్డ్ వాల్యూస్, మీ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల సీవీవీ, మీ డేట్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల వివరాలు లాంటివి సైబర్ నేరగాళ్లు రాబడతారు.
Also Read: First Salary: ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నారా? మరి ప్లాన్ ఏంటి?
బ్యాంక్ నుంచి అంటూ ఫోన్ కాల్స్....
సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మీకు కాల్ చేసి.. మేం మీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. ఆపై మీ వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక పరమైన సమాచారాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలుసుకుంటారు. ఆపై మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేయడమే వీరి ప్రధాన లక్ష్యం. బ్యాంక్ సిబ్బంది అని చెప్పిన తరువాత మీ వ్యక్తిగత వివరాలు, యూజర్ ఐడీ, పాస్ వర్డ్స్, ఓటీపీ, కార్డుల సీవీవీ, మీ పుట్టిన తేదీ సేకరించి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. కొన్ని సందర్భాలలో బ్లాక్ మెయిల్ చేసి, డబ్బు గుంజుతారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి...
మీకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. మొదటు ఎవరో వివరాలు కనుక్కోవాలి. నిర్ధారించుకున్న తరువాత వారితో విషయాల గురించి మాట్లాడాలి. మీకు ఇంకా అనుమానం ఉంటే ఆ కాల్స్‌ను వెంటనే కట్ చేయాలి. వారితో సుదీర్ఘ సంభాషషణతో మీ వ్యక్తిగత, బ్యాంకు వివరాలు వారి చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అనుమానిత ఫోన్ కాల్స్ వస్తే.. బ్యాంకుకు ఆ ఫోన్‌కాల్స్ వివరాలు తెలపడం ఉత్తమం.
Also Read: Facebook Loans : ఇండియాలో ఫేస్‌బుక్ వడ్డీ వ్యాపారం.. గ్యారంటీల్లేకుండా రుణాలు..!
ఫోన్ కాల్స్ ద్వారా వివరాలు తాము సేకరించము అని బ్యాంకులు చెబుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గుర్తుంచుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, సీవీవీ నెంబర్లు వంటివి మెస్సేజ్ రూపంలో సైతం పంపించాలని బ్యాంకులు ఏ ఖాతాదారులను అడగవు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వివరాలు వారికి మెస్సేజ్ చేయకూడదు.
ఈమెయిల్ రూపంలో సైతం మీ వివరాలు పంపించాలని కొందరు ఫోన్ చేసి మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. కనుక అలాంటి ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్‌కు స్పందించక పోవడం ద్వారా మీ బ్యాంకు ఖాతాకు భద్రత ఉంటుంది. క్యాష్ ప్రైజ్ లేదా బ్యాంక్ స్పెషల్ ఆఫర్స్ లాంటి లింక్స్ ఏవైనా మీ ఫోన్‌కు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని నిపుణులు, బ్యాంక్ సిబ్బంది సూచిస్తున్నారు.