గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి పేటీయం యాప్స్ మన జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయాయి. చిన్న చిన్న లావాదేవీలకు కూడా చాలా మంది ఈ యాప్స్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సేవలకు ఉపయోగపడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రస్తుతం పనిచేయడం లేదు. గంట నుంచి ఈ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
యూపీఐ సర్వర్లు డౌన్ అయిన వెంటనే.. పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని రిపోర్ట్ చేశారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి డిజిటల్ వాలెట్లు, ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసుల ద్వారా లావాదేవీలు చేయడం కుదరడం లేదని వినియోగదారులు అంటున్నారు.
కొంతమంది వినియోగదారులకు సమస్య యూపీఐలో ఉందా.. తమ ఫోన్ లేదా నెట్‌వర్క్‌లో ఉందా అనే విషయం కూడా అర్థం కావడం లేదు. ఫెయిల్ అయిన యూపీఐ లావాదేవీల స్క్రీన్ షాట్లను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గంటల తరబడి ప్రయత్నిస్తున్నా.. గూగుల్ పే ద్వారా పేమెంట్ పనిచేయడం లేదని ఒక వినియోగదారుడు పోస్ట్ చేశాడు.
గూగుల్ పే వినియోగదారులు అయితే దాదాపు రెండు గంటల నుంచి యూపీఐ పనిచేయడం లేదని అంటున్నారు. అయితే ఇటువంటి సమస్యలను రిపోర్ట్ చేసేటప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దని గూగుల్ పే వినియోగదారులను కోరింది.
తాజాగా వచ్చిన కథనాల ప్రకారం.. 2021 డిసెంబర్‌లో మనదేశంలో మొత్తం 456 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. మొత్తంగా రూ.8.26 లక్షల కోట్ల విలువైన నగదు చేతులు మారింది. గత సంవత్సరం మొత్తంగా రూ.73 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయట.
2021లో జరిగిన యూపీఐ లావాదేవీల్లో ఫోన్ పే ద్వారా రూ.3.94 లక్షల కోటల విలువైన లావాదేవీలు జరగ్గా.. గూగుల్ పే ద్వారా రూ.3.03 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇక రూ.88,094 కోట్ల విలువైన లావాదేవీలతో పేటీయం, రూ.6,641 కోట్లతో అమెజాన్ పే, రూ.188 కోట్లతో వాట్సాప్ పే తర్వాతి స్థానాల్లో నిలిచాయి.