ఆధార్ కార్డుల స్కామ్‌కు సంబంధించి UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక హెచ్చరిక జారీ చేసింది. వ్యక్తులు తమ ఆధార్ వివరాలను WhatsApp, ఇమెయిల్ లాంటి ప్లాట్ ఫారమ్‌ల ద్వారా పొందేందుకు కొంత మంది సైబర్ కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆధార్ వివరాలను పంచుకోవడం ద్వారా ఏ ఇబ్బంది ఉండదు అని భావిస్తున్నా, మున్ముందు తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ వివరాలను పరిచయం లేని వ్యక్తులతో పంచుకోవద్దని తేల్చి చెప్పింది.
కొద్ది రోజులుగా పెరిగిపోతున్న ఎమర్జింగ్ ఆధార్ స్కామ్స్
ఈ కొత్త స్కామ్‌లో, వ్యక్తులు తమ ఆధార్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకునేలా ఒప్పిస్తున్నారని UIDAI తెలిపింది. అందులో భాగంగానే వినియోగదారులు తమ ఆధార్ కార్డ్ వివరాలను WhatsApp లేదంటే Gmail లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ చేయమని అడుగుతున్నట్లు వివరించింది. చాలా మంది వారు చెప్పినట్లుగానే ఆధార్ వివరాలను పంపిస్తూ ఎమర్జింగ్ ఆధార్ స్కామ్ కు గురవుతున్నారని వెల్లడించింది. రాబోయే ఇబ్బందులను గమనించకుండా సున్నితమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకుంటున్నారని తెలిపింది.
కీలక హెచ్చరిక జారీ చేసిన UIDAI
ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం జిమెయిల్, వాట్సాప్ సహా ఇత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారి ఆధార్ వివరాలను ఎప్పుడూ కోరదని UIDA తేల్చి చెప్పింది. మీ ఆధార్ కార్డ్ ని అప్‌డేట్ చేయడానికి పాటించాల్సిన పద్దతులు అధికారిక UIDAI వెబ్‌సైట్‌లో పొందిపరచ్చినట్లు వెల్లడించింది. ఈ సైట్ లో అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌లను సురక్షితంగా సమర్పించవచ్చని తెలిపింది.
ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం ఏం చేయాలంటే?
ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ పద్ధతితో పాటు, వినియోగదారులు నేరుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాలని UIDAI సూచించింది. అక్కడి సిబ్బంది అడిగిన డాక్యుమెంట్లను అందజేసి తమ ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లో ఎలాంటి మోసాలకు తావు ఉండదని తెలిపింది.
స్కామర్లతో జాగ్రత్తగా ఉండాలి
ఆధార్ అప్ డేట్ పేరుతో స్కామర్లు సున్నిత సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించినా, వారితో జాగ్రత్తగా ఉండాలని UIDAI సూచించింది. అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ వివరాలను అందజేయ కూడదని వెల్లడించింది. అనుమానాస్పద ఫ్లాట్ ఫారమ్ లలో ఆధార్, బ్యాంకింగ్ వివరాలను చెప్పకూడదని సూచించింది. వ్యక్తిగత సమాచారం ఇచ్చే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమాత్రం అనుమానం కలిగినా, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. UIDAI వెల్లడించిన వివరాలను జాగ్రత్తగా పాటించాలన్నది. వ్యక్తిగత సమాచారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, ఆధార్ కార్డ్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని తెలిపింది. స్కామర్ల సున్నితమైన సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని వెల్లడించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial