Holi Smartphone Tips: దేశవ్యాప్తంగా జరుపుకునే అతి కొద్ది పండుగల్లో హోలీ ముందంజలో ఉంటుంది. ఈ పండగ రోజున ప్రజలందరూ తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని సంతోషిస్తారు. రంగులతో పాటు రంగు నీళ్లు కూడా చల్లుకునే వారు ఉంటారు. హోలీ ఆడే సమయంలో ఎంతో మంది ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో కూడా పోస్టు చేస్తూ ఉంటారు.


ఈ సమయంలో ఎంత ఎంజాయ్ చేస్తామో, స్మార్ట్ ఫోన్లను అంతే జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జేబుకి పెద్ద స్థాయిలో చిల్లు పడుతుంది. ఒక్కోసారి ఏకంగా ఫోన్ కూడా మార్చాల్సిన అవసరం వస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు ఎంతగానో ప్రేమించే స్మార్ట్ ఫోన్‌ను కాపాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ సేఫ్టీ కోసం తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం.


జిప్ లాక్ బాగ్స్ వాడాలి
ఫోన్ సేఫ్‌గా ఉంచుకోవడానికి ఇంత కంటే ఉత్తమమైన దారి మరొకటి ఉండదు. రంగులు, నీరు మీ స్మార్ట్ ఫోన్‌కు తాకకుండా ఇవి రక్షిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్ సెన్సిటివ్ జిప్ లాక్ బాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు ఫోన్‌ను జిప్ లాక్ బాగ్స్‌లో పెట్టాక కూడా ఉపయోగించవచ్చన్న మాట. కేవలం ఫింగర్ ప్రింట్‌ను ఉపయోగించడం మాత్రం సాధ్యం కాదు. దానికి బదులుగా పాస్ వర్డ్ లేదా ప్యాటర్న్‌ను ఉపయోగించుకోవచ్చు. మార్కెట్లో రూ.99 నుంచి జిప్ లాక్ బాగ్స్ అందుబాటులో ఉన్నాయి.


పోర్ట్స్ సీల్ చేయండి
జిప్ లాక్ బాగ్‌లో ఫోన్ పెట్టడం ఇష్టం లేకపోతే పోర్ట్స్ సీల్ చేసేయండి. అంటే ఛార్జింగ్ పోర్టు, స్పీకర్లను పూర్తిగా కవర్ చేసేయండి. డక్ట్ టేప్‌తో దీన్ని కవర్ చేసేయడం మంచిది. దీని వల్ల రంగులు, నీళ్లు మీ ఫోన్ పోర్ట్స్‌లోకి వెళ్లి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది.


నానో కోటింగ్ స్పే చేయవచ్చు
ఈ నానో కోటింగ్ స్ప్రేలు మీ స్మార్ట్ ఫోన్‌కు వాటర్ ప్రూఫ్ కోటింగ్‌ను అందిస్తాయి. ఇది స్ట్రయిట్ ఫార్వార్డ్ పద్ధతి కాగా, మంచి ఫలితాలను కూడా ఇవ్వనుంది. దీన్ని సరిగ్గా అప్లై చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. రూ.499 నుంచి మార్కెట్లో మంచి నానో కోటింగ్ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి.


ఒక్క రోజుకి వేరే ఫోన్ వాడవచ్చు
ఒకవేళ మీరు ఫొటోలు, వీడియోలు ఎక్కువగా తీసుకోకపోతే హోలీ పండగ రోజు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి బేసిక్ ఫోన్ ఉపయోగించవచ్చు. కొన్ని ముఖ్యమైన కాంటాక్ట్స్ మాత్రం కాపీ చేసుకుని వాడుకోవచ్చు. బేసిక్ ఫోన్ పాడైనా మనకు ఎక్కువ బాధ ఉండదు కదా.


ఆఖరి అస్త్రం ఉండనే ఉందిగా...
పైన తెలిపిన టిప్స్ అన్నీ ఫాలో అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఫోన్‌లోకి నీరు వెళ్లే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భంలో ఫోన్‌ను కాపాడటానికి అందరూ వాడే ఆఖరి అస్త్రం ఒకటి ఉంది. బియ్యం డబ్బాలో ఫోన్ పెట్టేసి, డబ్బా మూత గట్టిగా పెట్టేస్తే సరి. ఫోన్‌లో ఉన్న తేమను బియ్యం పీల్చుకుంది. కొన్ని గంటల్లోనే మీ ఫోన్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు.


ఇలా మాత్రం అస్సలు చేయకండి
ఫోన్ ఒక వేళ తడిస్తే దానిపై హెయిర డ్రయర్‌ను ఏమాత్రం ఉపయోగించకండి. ఇది పని చేయవచ్చు కానీ గాలి వచ్చే వేగం వల్ల ఫోన్ లోపలి భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?