Telegram Story Feature: టెలిగ్రాంలో ఇటీవలే స్టోరీ ఫీచర్‌ను అందించడంపై కంపెనీ పనిచేస్తుందని టెలిగ్రామ్ కొంతకాలం క్రితం తెలియజేసింది. ఇప్పుడు కంపెనీ ఈ అప్‌డేట్‌ను రోల్అవుట్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకున్న వారికి మాత్రమే స్టోరీ ఫీచర్ అందుబాటులో ఉంది.


అయితే ఫ్రీ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. టెలిగ్రామ్‌లో కనిపించే స్టోరీ ఫీచర్‌లోని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీరు కథను 6,12, 24, 48 గంటలు కనిపించేలా సెట్ చేయవచ్చు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కేవలం 24 గంటలు మాత్రమే స్టోరీని షేర్ చేసే అవకాశాన్ని ఇస్తాయి. అయితే మీరు టెలిగ్రామ్‌లో అంతకంటే ఎక్కువ సమయం పొందుతారు.


టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉన్న స్టోరీ ఫీచర్ కింద, మీరు ప్రతి స్టోరీకి స్పెషల్ కాంటాక్ట్ లిస్ట్‌ను సెటప్ చేయవచ్చు. అయితే మీరు స్టోరీ పోస్ట్ చేస్తే దాన్ని ఎవరైనా చూడగలరు కానీ ప్రీమియం ప్లాన్‌ని కొనుగోలు చేసిన వారు మాత్రమే స్టోరీని పోస్ట్ చేయగలరు.


టెలిగ్రామ్ సీఈవో గత నెలలో మాట్లాడుతూ ఈ ఫీచర్ ఇప్పటికే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఉన్నందున దీనిపై కంపెనీ మొదట ఆసక్తి చూపలేదన్నారు. కానీ వినియోగదారులు దానిని డిమాండ్ చేస్తున్నారని, దీని కారణంగా కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకురావలసి వచ్చిందని పేర్కొన్నారు. టెలిగ్రాం కొన్ని ప్రత్యేకమైన ఆప్షన్లతో వచ్చే ఈ అప్‌డేట్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది.


ఈ ఫీచర్‌ను ప్రకటిస్తూ వినియోగదారులు తమ స్టోరీలను ప్రొఫైల్‌లో సేవ్ చేసుకోవచ్చని కంపెనీ సీఈవో పావెల్ దురోవ్ తెలిపారు. ఇది యూజర్ ప్రొఫైల్‌ను మరింత ఇన్ఫర్మేటివ్‌గా మారుస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా యూజర్స్ గురించి వారి కాంటాక్ట్స్‌లో ఉన్నవారు మరింత తెలుసుకోగలుగుతారని తెలిపారు. ఈ ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లాగా ఉంటుందని, దీనిలో మీరు మీకు ఇష్టమైన విషయాలను ప్రొఫైల్‌లో హైలైట్‌లుగా సేవ్ చేసుకోవచ్చన్నారు.


టెలిగ్రాం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అయిన ‘టెలిగ్రాం ప్రీమియం’ జూన్‌లోనే 10 లక్షల సబ్‌స్క్రిప్షన్ మార్కును కూడా దాటింది. ఈ విషయాన్ని టెలిగ్రాం అధికారికంగా ప్రకటించింది. టెలిగ్రాం మానిటైజేషన్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే మిలియన్ మార్కును దాటడం విశేషం.


ప్రస్తుతం టెలిగ్రాంకు ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మనదేశంలో టెలిగ్రాం సబ్‌స్క్రిప్షన్ చార్జ్ నెలకు రూ.180 కాగా, ఇతర మార్కెట్లలో ఐదు డాలర్ల నుంచి ఆరు డాలర్ల మధ్యలో నిర్ణయించారు. టెలిగ్రాం ఓవరాల్ రెవిన్యూలో ఇది చాలా తక్కువ శాతమే అయినా చాలా వేగంగా దీని మార్కెట్ పెరుగుతోందని టెలిగ్రాం ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ అన్నారు.


టెలిగ్రాం ప్రీమియంలో కొన్ని అదనపు ఫీచర్లు కూడా అందించారు. ఏకంగా 20 చాట్ ఫోల్డర్లు క్రియేట్ చేసుకునే ఫీచర్ ఇందులో అందుబాటులో ఉంది. 10 చాట్ల వరకు పిన్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా అందించారు. సోషల్ మీడియా యాప్స్ లాంచ్ చేసిన బెస్ట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌గా టెలిగ్రాం ప్లాన్ నిలిచిపోనుంది.


Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial