Starlink Pakistan Price: ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ పాకిస్తాన్‌లో తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ కంపెనీ పాకిస్తాన్‌లో రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు లైసెన్స్ పొందడానికి వేచి ఉంది. ఇంతలో పాకిస్తాన్‌లో స్టార్‌లింక్ ప్లాన్ ధరల గురించి సమాచారం వెలుగులోకి వచ్చింది. చాలా మంది దాని ధరను చూసి షాక్ అవుతున్నారు. ఒక యూజర్ బేస్ ప్లాన్‌ను తీసుకుంటే, మొదట్లోనే అతను లక్ష పాకిస్తానీ రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.30,800కు పైమాటే అన్నమాట.
ఇన్‌స్టాలేషన్ కూడా ఖరీదైనదే...
మీడియా నివేదికల ప్రకారం గృహ వినియోగం కోసం స్టార్‌లింక్ ప్లాన్ ధర నెలకు 6,800-28,000 పాకిస్తానీ రూపాయలు ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,600 వరకు అన్నమాట. ఇందులో వినియోగదారులు 50 నుంచి 250 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని పొందుతారు. దీంతో పాటు స్టార్‌లింక్ సేవను పొందడానికి అవసరమైన హార్డ్‌వేర్ ధర 97,000 పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 30,000) ఉంటుంది. దీనికి ఇన్‌స్టాలేషన్ కోసం శాటిలైట్ డిష్, కనెక్షన్ కోసం మోడెమ్ అవసరం. ఇంత ధరను చూసినప్పుడు ఇది 200 సంవత్సరాల సబ్‌స్క్రిప్షన్ లాగా అనిపిస్తుందని ఒక సోషల్ మీడియా యూజర్ రాశారు.
కమర్షియల్ ఇంకా కాస్ట్లీ...
వాణిజ్య ఉపయోగం కోసం స్టార్‌లింక్ సర్వీసు మరింత ఖరీదైనది. 100 నుంచి 500 ఎంబీపీఎస్ వేగం ఉంటే వాణిజ్య వినియోగదారులు ప్రతి నెలా 80,000-95,000 (మనదేశ కరెన్సీలో దాదాపు రూ.30 వేల వరకు) పాకిస్తానీ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య వినియోగదారులకు ఇన్‌స్టాలేషన్ కూడా ఖరీదైనది. వారు దాని కోసం 2.20 లక్షల పాకిస్తానీ రూపాయలు చెల్లించాల్సి రావచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.68 వేల వరకు అన్నమాట. కంపెనీ తన అన్ని ప్లాన్‌లలో అపరిమిత డేటాను అందిస్తుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
ఇతర దేశాలలో ధర ఎంత?
స్టార్‌లింక్ సేవ జాంబియాలో అత్యంత చవకైనది. ఇక్కడ యూజర్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కోసం 800 క్వాంచాలు చెల్లించాలి. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు 2,400 అన్నమాట. అమెరికాలో వినియోగదారులు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కోసం దాదాపు రూ. 10,000, మలేషియాలో దాదాపు రూ. 3,800, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 7,800, ఆస్ట్రియాలో దాదాపు రూ. 4,700 చెల్లించాలి.
మనదేశంలో త్వరలోనే...
భారతదేశంలో స్టార్‌లింక్ సర్వీసులు త్వరలో ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం కంపెనీకి స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఈ నెలలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కంపెనీ ఫిబ్రవరి నాటికి భారతదేశంలో తన సేవలను ప్రారంభించవచ్చు. జియో, ఎయిర్‌టెల్ కూడా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించనున్నాయి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?